Politics

క‌న్నాకు గ‌న్ మెన్లు తొల‌గింపు

క‌న్నాకు గ‌న్ మెన్లు తొల‌గింపు

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే కాదు నియోజకవర్గాల్లోనూ పరిస్ధితులు ఉప్పునిప్పుగా మారుతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న చోట రిస్క్ తీసుకునేందుకు సిద్ధం కావడం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం వెలువడింది.

పల్నాడులోని సత్తెనపల్లిలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న గన్ మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజులుగా కన్నా ఇంటికి గన్ మెన్లు రావడం లేదు. ఆరా తీస్తే ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు తాము విధులకు రావడం లేదని చెప్పినట్లు సమాచారం.

కన్నా లక్ష్మీనారాయణకు ఐదేళ్ల క్రితమే గన్‌మెన్లను కేటాయించారు. అప్పట్లో నెలకొన్న పరిస్ధితులతో ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు గన్‌మెన్లను ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఈ భద్రత కొనసాగింది. అయితే కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం.. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా కన్నా భద్రత కొనసాగింది.అయితే తాజాగా ప్రభుత్వం హోంశాఖ తరఫున నిర్వహించే సమీక్షలో కన్నాకు భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ కన్నాకు మాత్రం గన్‌మెన్ల ఉపసంహరణపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కన్నాకు భద్రత లేకుండా చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నాను టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ ఆయన కదలికలు పెరిగాయి. దీంతో సహజంగానే ఇది మంత్రి అంబటిపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలో కన్నాకు భద్రత ఉపసంహరణ వెనుక అంబటి రాంబాబు హస్తం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.