DailyDose

కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి-TNI నేటి నేర వార్తలు

కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి-TNI నేటి నేర వార్తలు

భార్య, మేనల్లుడిని చంపిన పోలీస్‌

 ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పుణె (Pune)లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.అమరావతి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP) భరత్‌ గైక్వాడ్‌(57) బానర్‌ ప్రాంతంలో కుటుంబంతో నివాసముంటున్నాడు.  విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అధికారి తన తుపాకీతో మొదట తన భార్య మోని గైక్వాడ్ (44) తలపై కాల్చాడు.తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగున వచ్చారు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్‌ (35)పై కూడా కాల్పులు జరిపాడు. ఛాతీపై బులెట్‌ తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఆ పోలీసు అధికారి మరణించాడు. అయితే.. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 గాలిలో విమానం తలుపు తెరిచేందుకు యత్నం

ప్యారిస్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానం (ఎఎఫ్‌-194) గాలిలో ఉండగా వెంకట్ మోహిత్‌ అనే ప్రయాణికుడు వెనుక భాగం ఎడమవైపు ఉన్న తలుపును బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించాడు. గమనించిన ప్రయాణికులు అతణ్ని అడ్డుకున్నారు. విమానం గమ్యస్థానానికి చేరాక విమానాశ్రయం అధికారులకు సమాచారమిచ్చారు. విమానయాన సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో అతణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నామని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు ఆదివారం తెలిపారు.

ఉడిపి కాలేజీ వాష్ రూం ఘటన

కర్నాటకలోని ఉడిపిలోని ఓ ప్రతిష్టాత్మక మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు  వాష్‌రూమ్‌లో మరో విద్యార్థినిని నగ్నవీడియో తీసినందుకు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన అమ్మాయిలు.. అలిమతుల్ షైఫా, షబానాజ్, అలియాలు. అయితే ఇప్పుడు దీనిమీద తీవ్ర దుమారం రేగుతోంది. వీరు తమ తోటి విద్యార్థులు వాష్ రూంలో ఉండగా రికార్డ్ చేయడానికి వీడియో కెమెరాలను అమర్చారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు..  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆప్టోమెట్రీ ఇన్‌స్టిట్యూట్ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రకారం,  కాలేజీలోకి సెల్ ఫోన్లు తెచ్చినందుకు.. రహస్యంగా వీడియో తీసినందుకు రెండు నేరాల కింద వీరిని సస్పెండ్ చేశారు.అయితే, ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేసుగా కనిపించడంతో సోషల్ మీడియాలో దీనిమీద తీవ్ర చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఈ కేసును 1992 నాటి అజ్మీర్ లైంగిక కుంభకోణానికి లింక్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి కేసే అని మండిపడుతున్నారు. అజ్మీర్ కేసులో వందలాది మంది స్కూలు, కాలేజీ బాలికలు వారి నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ కి గురయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు వీరిమీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.మానవ హక్కుల కార్యకర్త రష్మీ సమంత్ ఉడిపి ఘటనను అజ్మీర్ ఘటనతో ముడిపెట్టారు. వరుస ట్వీట్లలో, నగ్న ఛాయాచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేయబడిన అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో జరిగింది వివరిస్తూ… అటువంటి వీడియోలు లేదా ఫోటోలు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులలో నేరస్థులకు పంపబడ్డాయని సమంత్ ఆరోపించారు. 

ఆర్టీసీ బస్సు, క్లూజర్ ఎదురెదురుగా ఢీ

 శ్రీశైలం దైవ దర్శనానికి వెళుతుండగా ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, క్లూజర్ ఎదురెదురుగా ఢీకొని 15 మందికి గాయాలైన సంఘటన హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిలో అమ్రాబాద్ మండలం వటపర్లపల్లి గ్రామ సమీపంలోని రాసుమల్లబావి వద్ద జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మెహదీపట్నంలోని ఆర్సీపురం ప్రాంతాల నుంచి సోమవారం ఉదయం క్లూజర్ వాహనంలో రెండు కుటుంబాలకు చెందినవారు శ్రీశైలం దైవదర్శనానికి వెళుతుండా ప్రమాదవశాత్తు రాసుమల్ల బావి వద్ద ఆర్టీసీ బస్సు, క్లూజర్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో హరీశ్వర్, చంద్రకళ, సరిత, రుచిత, సత్యనారాయణ, నాగేష్, లక్ష్మి, సాయి, గణేష్, కార్తీక్ తదితరులకు గాయాలయ్యాయి. యని తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్షతగాత్రులలో సరిత, చంద్రకళ, నాగేష్, లక్ష్మీల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదంపై ఈగలపెంట ఎస్సై వీరమల్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను చంపి భర్త పరార్

ఖమ్మం మూడో డివిజన్ జయనగర్ కాలనీ 17వ స్ట్రీట్ లో  నివాసముంటున్న భూక్య పార్వతి(43) ఆదివారం తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.  మృతురాలి తమ్ముడు భూక్య రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..  భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో  ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేసే తన బావ భూక్య సీతారాములు,  అక్కను హత్యచేసి పారిపోయినట్లు ఆరోపించాడు. శనివారం రాత్రి అక్క, బావ మధ్య ఘర్షణ జరిగినట్లు చుట్టుపక్కల వారు చెప్పారన్నాడు.  బావ సీతారాములుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని, అనుమానంతో జయనగర్ లోని ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా అక్క నేలపై పడి మృతి చెంది కనిపించిందని తెలిపాడు.  వెంటనే డయల్ 100 కు కాల్ చేసినట్లు చెప్పాడు.  20 ఏండ్లుగా పార్వతిని నిత్యం అనుమానిస్తూ, వేధింపులకు గురిచేసేవాడని ఆరోపించాడు.  ఎన్నోసార్లు పంచాయితీలు పెట్టించి సర్ది చెప్పి బావ సీతారాములుతో, అక్కను పంపేవాళ్లమని తెలిపాడు. మృతురాలికి ఇద్దరు సంతానం. ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు.  శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తోపులాటలో భర్త సీతారాములు, భార్య పార్వతిని బలంగా నెట్టివేయడంతో తలకు సోఫా ఉడ్ బలంగా తగిలి రక్తం కారి చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఖానాపురం హావేలి పీఎస్ సీఐ హరి, ఎస్సై స్వప్న ఘటన స్థలాన్ని పరిశీలించి,  కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో మరో అరాచకం

గిరిజనుడిపై మూత్రం పోసిన దుర్ఘటన మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరో దారుణం. ఛతర్‌పుర్‌ జిల్లాలో పొరపాటున గ్రీజు అంటినందుకు దళితుడి ముఖం, శరీరంపై ఓ వ్యక్తి మలం పూశాడు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బికౌర గ్రామంలో మురుగుకాలువ నిర్మించే పనికి దశరథ్‌ అహిర్వార్‌ అనే దళిత వ్యక్తి వెళ్లాడు. నిర్మాణపనులకు సమీపంలో ఉన్న చేతిపంపు వద్ద రాంకృపాల్‌ పటేల్‌ అనే వ్యక్తి స్నానం చేస్తున్నాడు. ఈ సందర్భంగా దశరథ్‌ చేతికి ఉన్న గ్రీజు రాంకృపాల్‌కు అంటింది. దీంతో కోపోద్రిక్తుడైన రాంకృపాల్‌.. తాను స్నానం చేస్తున్న మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి దశరథ్‌ తల, ముఖం, శరీరంపై పూశాడు. కులం పేరుతోనూ దూషించాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయితీ దృష్టికి తీసుకెళ్తే.. తిరిగి బాధితుడికే రూ.600 జరిమానా విధించారు. దీంతో దశరథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఎస్‌డీవోపీ మన్‌మోహన్‌సింగ్‌ భగేల్‌ శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పని కోసం వచ్చి బంగారం ఎత్తుకెళ్లిండు

ఇంట్లో  రిపేర్​ పని చేయడానికి వచ్చిన ఓ ప్లంబర్​ అదే ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండిని దోచుకొని ఉడాయించాడు.   సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది.  బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   కొమురవెల్లికి చెందిన అంబడిపల్లి నాగరాజు  తన  ఇల్లు రిపేర్​ కోసం  అదేగ్రామానికి చెందిన మేడికుంట మల్లేశంను పిలిచాడు. రిపేర్​ పనులు ఉండడంతో కుటుంబసభ్యులు ఇంటి సామాన్లను, వస్తువులను, బంగారు ఆభరణాలను సర్ది బంగ్లాపై ఉన్న మరో రూమ్​లో భద్రరిచారు.  శనివారం ప్లంబర్​ మల్లేశంవచ్చి,  పని అయిపోయినట్టు నాగరాజు భార్య అర్చనకు తెలిపాడు.  ఇంటిపైన  పని చేసిన సామాన్లు ఉన్నాయని చెప్పిన మల్లేశం.. పైకి వెళ్లి,  ఓ బ్యాగ్​తో బయటకు వెళ్లాడు.  కొద్ది సేపటి తర్వాత  అర్చన బంగ్లాపైకి వెళ్లింది. ఇంటి సామాన్లు  భద్రపరిచిన గది తాళం పగలగొట్టి ఉంది. అది గమనించిన అర్చన లోపలికి వెళ్లి చూడగా.. బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు  బాక్స్​ తాళం కూడా పగిలి ఉంది.  చోరీ జరిగిందని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులకు  సమాచారం ఇచ్చింది.  మల్లేశంపై అనుమానంతో అతడికి ఫోన్​ చేసి ఇంటికి రమ్మన్నారు. తర్వాత మళ్లీ ఫోన్​ చేయగా ఫోన్​ అందుబాటులోకి రాలేదు. దీంతో  నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని  ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి,   నిందితుడి కోసం వెతుకుతున్నామన్నారు.

భార్య అందంగా ఉందని అనుమానం

అందంగా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. భర్తలో అనుమానం భూతం రెక్కలు విప్పుకుంది. చివరికి అది పెనుభూతంగా మారి ఆమెను హత్య చేసే వరకు దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగు చూసింది. తల్లి హత్యకు గురవడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. కళ్యాణ్ అలియాస్ చంటికి శిరీష (23) అనే మహిళతో ఐదేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. వీరికి సంతానం ఇద్దరు మగపిల్లలు. కాగా పెళ్లైన కొద్ది రోజులనుంచి కల్యాణ్ కు భార్య మీద అనుమానం ఏర్పడింది.అది పెనుభూతంగా మారింది. దీంతో ఆమెను హత్య చేశాడు. దీనిమీద వన్ టౌన్ సీఐ విక్రమసింహ మాట్లాడుతూ… ఆదోనిలోి కిలిచిన పేటకు చెందిన నాగులు, వీరాభాయి కొడుకు కల్యాణ్. అతనికి కొంతకాలంగా భార్యమీద అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచుగా గొడవకు దిగుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా భార్యభర్తలు తీవ్రంగా గొడవపడ్డారు. ఆదివారం ఉదయం ఆ గొడవ నేపథ్యంలోనే భార్య శిరీషను చంటి టవల్ తో గొంతుకు ఉరివేసి చంపేశాడు. ఆ తరువాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు తమ చిన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడితే చూడడానికి వెళ్లారు. 

*  కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి

భారతీయ విద్యార్థులపై ఇతర దేశాల్లో దాడులు ఇటీవల ఎక్కువైనాయి. తాజాగా కెనడా లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌‌గా పనిచేస్తున్నాడు. జులై 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగ ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లగా, ఆ సమయంలో అతని పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. అనంతరం అతను పిజ్జా డెలివరికి తెచ్చిన వాహనాన్ని సైతం ఆ దుండగులు దొంగలించారు.ఈ దాడిలో గుర్ విందర్‌కు తీవ్ర గయాలపాలై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అతను జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. జులై 27న గుర్ విందర్ మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు. మరోవైపు గుర్ విందర్ పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.