Politics

ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన

ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి  జగన్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కృష్ణాయపాలెం చేరుకున్న తర్వాత కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.. ఇక, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఏపీ సీఎం.. శంకుస్థాపన చేసిన అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మోడల్‌ హౌజ్‌ను పరిశీలించారు.. కాగా, కృష్ణాయపాలెం లేఅవుట్‌లో 50,793 ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1,829.57 కోట్లు వెచ్చించనుంది. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వ్యయంతో అన్ని మౌలిక వసతులతో 50,793 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.. సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్‌లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఇక, సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెసిందే.. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా అందజేశారు.. ఇక, ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. మరోవైపు.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో 28,000 మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.