DailyDose

మళ్లీ డేంజర్ స్థాయికి యమున

మళ్లీ డేంజర్ స్థాయికి యమున

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిని వరణుడు తీవ్రంగా వణికిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ ఇప్పటికే వరద ముప్పుతో భయంలోనే బతుకీడుస్తోంది. దిల్లీలో మరోసారి యమునా నది ప్రవాహం ప్రమాదకరస్థాయి (205.33 మీటర్లు)ని దాటింది. గత కొద్దిరోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉంది. తాజాగా హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఉదయం 206.07 మీటర్లకు చేరుకుంది.యమునా డేంజర్ లెవల్​కు చేరడంతో మరోసారి దిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల దిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల దిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని  మంత్రి అతిశీ వెల్లడించారు.