కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29వ తేదీన హైద్రాబాద్ కు రానున్నారు. పార్టీలోని పలు విభాగాల నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా పటిష్టపర్చే విషయమై నేతలతో చర్చించనున్నారు. సంస్థాగత అంశాలపై అమిత్ షా పార్టీ నేతలతో చర్చిస్తారు. పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సీనియర్లతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ నెల 26న బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.ఈ సమావేశంలో ఎన్నికల కమిటీలను ఖరారు చేయనున్నారు.ఈ కమిటీలతో అమిత్ షా భేటీ కానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది.ఈ దిశగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణలో పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదటి వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ప్రధాని పర్యటించిన మరునాడే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడ హైద్రాబాద్ కు వచ్చారు.దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలతో నడ్డా భేటీ అయ్యారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతం దిశా నిర్ధేశం చేశారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. దీంతో ఖమ్మం సభ రద్దైంది. అయితే ఈ నెల 29న హైద్రాబాద్ కు అమిత్ షా రానున్నారు. ఈ దఫా మాత్రం అమిత్ షా పార్టీ సంస్థాగత అంశాలకే పరిమితం కానున్నారని సమాచారం