బాలకృష్ణ సినిమాలు ఒకప్పుడు థియేటర్ ను షేక్ చేశాయి. ఇప్పుడు కుర్రహీరోలను చూసి బాలయ్య ను కాస్త కౌంటర్లు ఇస్తున్నారు కాని ఆయన గ్లామరే వేరు.అసలు భైరవధ్వీపం అయితే ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ..అందుకే బాలయ్య ఫ్యాన్స్ కు మళ్లీ ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) జానపద, పౌరాణిక చిత్రాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. ఆయన చివరిగా నటించిన పౌరాణిక చిత్రం ‘శ్రీరామరాజ్యం’. ఇక జానపద చిత్రమైతే ఎప్పుడో 1994లో చేశారు. అదే ‘భైరవద్వీపం’. బాలకృష్ణ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు పూర్తికావస్తున్నా ఇంకా చాలా మందికి ఇది ఫేవరేట్. అందుకే, ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నారు.
క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై చంద్రశేఖర్ కుమారస్వామి, పి. దేవ్ వర్మ ‘భైరవద్వీపం’ సినిమాను 4K క్వాలిటీలోకి అప్‌గ్రేడ్ చేసి ఆగస్టు 5న మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో ప్రస్తుత ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు ఈ సినిమాకు కథ అందించగా.. సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు. చందమామ విజయా కంబైన్స్ బ్యానర్‌పై బి.వెంకట్రామిరెడ్డి నిర్మించారు. కైకాల సత్యనారాయణ, సంగీత, విజయకుమార్, కె.ఆర్.విజయ, రంభ, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు.
ఇందులో వచ్చే విలన్ పాత్రకు ఎంతో మంది పెద్ద పెద్ద యాక్టర్లను వాకబు చేశారు డైరక్టర్ కాని ఎవ్వరు కుదర్లేదు. కాని ఓ మళయాళం సినిమాలో యాక్ట్ చేసిన రాజకుమార్.. వెంకట్రామిరెడ్డిని ఆకర్షించారు. ఆ నటుడు తెలుగువాడని కూడా తెలియడంతో మాంత్రికుడి వేషానికి ఎంపిక చేశారు డైరక్టర్ . ‘విజయా’ సంస్థ పేరు, ఎస్.వి.రంగారావు పేరును కలిపి విజయ రంగరాజు అనే పేరుతో ‘భైరవద్వీపం’లో విలన్‌గా పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు చేశారు.అప్పట్లో ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాలో మాంత్రికుడు కనిపించినప్పుడల్లా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చే ‘కవచ కవచ’ అనే సౌండ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిందట. ఇప్పుడు అదే సౌండ్‌ను మరోసారి థియేటర్లలో డాల్బీ టెక్నాలజీతో వినొచ్చు.