దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. దిల్లీ మద్యం కేసు విచారణకు తమ కార్యాలయానికి రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మార్చి 27న విచారించి.. పిటిషన్‌ను నళిని చిదంబరం కేసుతో జత చేసింది. సోమవారం జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ రెండు పిటిషన్‌లతోపాటు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల కేసు విచారణను సైతం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.