DailyDose

ఏపీలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు-TNI నేటి తాజా వార్తలు

ఏపీలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు-TNI నేటి తాజా వార్తలు

* NEET PG కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 2023-24 సంవత్సరానికి PG మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 4 రౌండ్లలో కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 1న పూర్తి కానుండగా, 5న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 21 లోపు రెండో రౌండ్ రిజిస్ట్రేషన్, 25న సీట్ల కేటాయింపు.. SEP 12లోపు మూడో రౌండ్ రిజిస్ట్రేషన్, SEP 16న సీట్ల కేటాయింపు, 4వ రౌండ్కు SEP 30 లాస్టేట్ కాగా, OCT 4న సీట్లను కేటాయిస్తారు.

ఏపీ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. కొలిజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. జులై 5వ తేదీన కొత్త ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ను నియమించాలని సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీచేసింది. కొలిజియం సిఫార్సులపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

* అమిత్ షా, ప్రియాంక టూర్లపై కేసీఆర్ ఫోకస్ ?

TS: కేంద్ర హోంమంత్రి అమిత్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో వారి పర్యటనలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపు నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్కు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులు త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదు: లోక్‌సభ

విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని వివిధ అంశాలపై తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని లోక్‌సభలో అడిగిన వివిధ ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని వెల్లడించారు. రూ.106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ కార్యాలయం నిర్మిస్తామని, ఇందుకోసం 2023-24లో రూ.10కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదన్నారు. సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచరణ సాధ్యం కాలేదన్నారు. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించిందన్నారు.రామాయపట్నం నాన్‌- మేజర్‌ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేశారన్న కేంద్రం.. రామాయపట్నం మైనర్‌ పోర్టును డి-నోటిఫై చేయాలని ఏపీకి చెప్పామని కేంద్రం వెల్లడించింది. రామాయపట్నం వద్దంటే మేజర్‌పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని కేంద్రం సూచించింది. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. వర్సిటీలు, పోలవరం, రాజధానికి రూ. 21,154 కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఐఐటీకి రూ.1,022 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేశామని నివేదికలో పేర్కొంది. ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేసింది.

టమాటా సాగుతో కోటీశ్వరుడైన తెలంగాణ రైతు

 టమాటాలు… ప్రస్తుతం ఈ పేరు వింటేనే సామాన్యులు కంగారుపడిపోతున్నారు. ఆకాశాన్నంటిన టమాటా ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ ఇవే టమాటాలు కొందరు రైతులను రాజులను చేస్తున్నాయి. పెద్దపెద్ద వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు కూడా నెలలో కోట్లు సంపాదించలేరు… కానీ కొందరు టమాటా రైతులు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు కళ్లజూస్తున్నారు. ఇలా తెలంగాణకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి టమాటా పంట సాగుచేసి కోట్లు సంపాదించడమే కాదు అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.  స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిపాల్ రెడ్డి దంపతులను సెక్రటేరియట్ కు పిలిపించుకుని మరీ అభినందించడమే కాదు శాలువాతో సత్కరించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డికి వంద ఎకరాల వ్యవసాయ భూమి వుంది. గతంలో ఎక్కువగా వరి సాగుచేసి ఆశించిన లాభాలు పొందలేకపోయిన ఆయన కూరగాయల సాగువైపు మళ్ళాడు. ఇలా దాదాపు 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నాడు. అయితే ఈసారి అతడికి టమాటా రూపంలో జాక్ పాట్ తగిలింది.ఈసారి టమాటాలు అమ్మడం ద్వారా రైతు మహిపాల్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాందించాడు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటాలు అమ్మగా మరో కోటి రూపాయల విలువైన పంట అమ్మకానికి సిద్దంగా వున్నట్లు 40ఏళ్ల ఈ రైతన్న చెబుతున్నాడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయం చేయడమే కాదు ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని పిలిపించుకుని మరీ సన్మానించారు కేసీఆర్. 

రివర్స్ గేర్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు :చంద్రబాబు

వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సీఎం జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. వ్యవస్థలను చంపి రివర్స్ గేర్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. సంక్షోభానికి కారణమైన జగన్ కి పరిపాలించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు చంద్రబాబు.మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగిస్తున్నారని.. రైతులపై ప్రేమతో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అన్నదాత పథకం అమలు చేసి ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని.. టిడిపి పాలనతో పోలిస్తే జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై బడ్జెట్ ను తగ్గించిందని ఆరోపించారు.

* ఆగస్టు 12న TTC ఎగ్జామ్

TS: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (TTC) లోయర్ గ్రేడ్ పరీక్షలను ఆగస్టు 12న నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 12న ఉ.11 నుంచి 1 వరకు, మ.2 నుంచి 3 వరకు, మ.3.30 నుంచి 4.30 వరకు మూడు పేపర్ల ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

 ఆ జిల్లాపై విజయ సాయిరెడ్డి ఫోకస్

జస్ట్ స్మాల్ గ్యాప్ అంతే… తగ్గేదే లేదంటున్నారు ఆ సీనియర్ నేత. అధికార పార్టీలో టాప్ 5 లో ఉన్నా… కొంతకాలంగా మౌనంగా ఉండటం అనేక ఆరోపణలకు దారి తీసింది. మళ్లీ పార్టీలో ఆక్టివ్ కావడమే కాదు… కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్తున్నారు. వరుస సమావేశాలతో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇపుడు జగన్ తనకి కొత్త భాద్యతలు అప్పగించారు. పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి కి ఇపుడు రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ బిజీ అయిపోయారు.కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పై రకరకాల ప్రచారం జరిగింది.. అంతే కాదు సీఎం జగన్ తర్వాత పార్టీలో టాప్ 5 లో ఉన్న విజయసాయిరెడ్డి దూరంగా ఉండటం నేతలు, కార్యకర్తల కు కూడా ఇబ్బందిగా మారిందట.. ఆ మధ్య బాలినేని వద్దని తప్పుకున్న రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు సాయిరెడ్డి కి ఇచ్చి అక్కడి పరిస్తితి చక్క దిద్దాలని సీఎం భావించారు.. అందుకే ఇపుడు ఆ కృషియల్ పదవిని సై రెడ్డి కి ఇచ్చారు.వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో రీఎంట్రీ ఇచ్చిన విజయసాయిరెడ్డి..వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపేశారు…పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు..కేవలం మీటింగ్ కె పరిమితం కాకుండా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం పార్టీ నాయకులకు కొత్త ఊపు తెచ్చిందంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు.పార్టీ బలోపేతం చేయడం, ఖాళీగా ఉన్న పదవుల భర్తీపైనా ఆదేశాలు ఇచ్చారట ఎంపీ విజయసాయిరెడ్డి. అనుబంధ విభాగాల జోనల్ ఇంఛార్జీలు,జిల్లా ప్రెసిడెంట్స్,మండల ఇంఛార్జీల ఖాళీలు భర్తీ చేయాలని సూచించారట.

ఏపీలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. మంగళవారం, బుధవారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆవర్తన ప్రభావంతో మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.అల్లూరి సీతారామరాజు ఏలూరు, కృష్ణా, ఎన్ టి ఆర్ జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు.ఇరు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి లక్ష పద్నాలుగు వేల క్యూసెక్ ల నీటిని విడుదల చేసింది. ఇప్పటికే వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 5వేల క్యూసెక్ ల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.

ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు

 ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండ్‌గా పనిచేస్తున్న కేఆర్‌ సూర్యనారాయణను సస్పెండ్‌ చేస్తూ  ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌ జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యేంత వరకు ఆయనపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంటూ రాష్ట్రపన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ ప్రోసీడింగ్స్ జారీ చేశారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్‌ సూర్యనారాయణ తోపాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగం మోపింది.ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం అభియోగాల్లో తెలిపింది.   వీటిపై విజయవాడ సిటీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని అయితే ఆయన ఇప్పటికీ విచారణకు సహకరించకుండా పరారీలో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ప్రజాప్రయోజనాల రీత్యా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.  సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా విజయవాడను వీడి వెళ్లొద్దంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మోదీ వ్యాఖ్యలపై రాహుల్ రియాక్షన్

 ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ‘‘ప్రతిపక్షాల ప్రవర్తనను బట్టి, వారు ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మేము ప్రజల ప్రయోజనాల కోసం పని చేసి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నారు. I.N.D.I.A అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన… ప్రతిపక్షాల తీరు మారుతుందా? అని మోదీ ప్రశ్నించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందన్నారు. ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. మణిపూర్‌ను నయం చేయడానికి ప్రతిపక్ష కూటమి సహాయం చేస్తుందని అన్నారు. మణిపూర్‌లో ఇండియా ఆత్మను పునర్నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘మిస్టర్ మోదీ.. మీకు ఏవిధంగా పిలవాలని అనిపిస్తే అలాగే పిలవండి. మేము ఇండియా. మేము మణిపూర్‌ను నయం చేయడానికి, అక్కడి మహిళలు, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. ప్రజలందరికీ ప్రేమ మరియు శాంతిని తిరిగి తెస్తాము. మేము మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాము’’రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.