అరుణోదయ వర్ణం హృదయాన్ని కదిలిస్తుంది. పచ్చదనం సంతరించుకున్న ప్రకృతి ఉల్లాసాన్ని ప్రసాదిస్తుంది. ఇలా రంగుల హంగులు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కో వర్ణాన్ని చూసినప్పుడు ఒక్కో అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, మనకు నచ్చిన రంగు మనమేంటో చెబుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం ప్రకారం
ఎరుపు: అత్యల్ప పౌనఃపున్య అవధి కలిగిన ఎరుపు మెచ్చే మనుషులు కాస్త అధికులమనే భావనలో ఉంటారట. తొగరు రంగు ఇష్టపడేవాళ్లు చాలా విషయాల్లో పొగరుగా వ్యవహరిస్తారని అధ్యయనకారుల వివరణ. అయితే, ఈ తరహా వ్యక్తులకు పట్టుదల ఎక్కువే! చేపట్టిన పనిని ఎలాగైనా పూర్తి చేసే శక్తిసామర్థ్యాలు వీళ్లకు ఉంటాయి.
పసుపు: పవిత్రతకు చిహ్నమైన పసుపును ఇష్టపడేవాళ్లూ పవిత్రమైన మనసు కలిగి ఉంటారట. అంతేకాదు వీళ్లలో క్రియేటివిటీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. తను ఇష్టపడిన వాళ్లను మచ్చిక చేసుకోవడంలోనూ ముందుంటారట. వ్యక్తిగత భావోద్వేగాలను అదుపుచేసుకునే ప్రయత్నంలో ఉంటారట.
ఆకుపచ్చ: ఈ రంగు సంపదకు ప్రతీక. హరిత వర్ణాన్ని ఇష్టపడేవాళ్లు లాజికల్‌గా థింక్ చేస్తారట. అయితే మొహమాటం వీరి తెలివితేటలను బయటపడనివ్వదు. పాదరసంలా చురుకైన మెదడున్నా.. ప్రదర్శించే తీరు కాదన్నమాట!
పర్పుల్: రిచ్ కలర్‌గా చెప్పే పర్పుల్‌ను ఇష్టపడేవాళ్లలో భవిష్యత్తు గురించి ఆలోచించే గుణం ఉంటుందట. అయితే, భారీగా ఊహించుకొని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోనై చేయదలచిన కార్యాన్ని మధ్యలోనే వదిలేసే స్వభావం వీరిదట.