* బ్యూటీ పార్లర్లు మూసివేయాలని తాలిబాన్ల ఆదేశం
ఆఫ్ఘనిస్తాన్లో అన్ని బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. ‘ఇస్లాంలో నిషేధిత సేవలను బ్యూటీ పార్లర్లు అందిస్తున్నాయి. దీంతో పాటు పెళ్లి సమయంలో అబ్బాయిలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని తాలిబాన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ నిర్ణయంతో ఆ దేశంలో సుమారు 60 వేల మంది ఉపాధి కోల్పోనున్నారు. ఈ ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆఫ్ఘన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు ఐరాస తెలిపింది.
* యాక్సిస్ బ్యాంక్ లాభంలో 40 శాతం వృద్ధి
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి త్రైమాసిక ఫలితాల (Q1 Results)ను బుధవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.5,797 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదుచేసిన రూ.4,125 కోట్లతో పోలిస్తే కంపెనీ లాభం 40.5 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.21,657 కోట్ల నుంచి రూ.30,644 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.18,729 కోట్ల నుంచి రూ.25,557 కోట్లకు చేరిందని తెలిపింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 27 శాతం పెరిగి రూ.11,959 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 3.6 శాతం నుంచి 4.10 శాతానికి పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
* శాంసంగ్ లాంచ్ ఈవెంట్
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్‌ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
* రికార్డు స్థాయిలో పెరిగిన టమాటా ధరలు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్లో రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా ధర ఏకంగా రూ.168 పలికింది. ఏ గ్రేడ్ ధర కిలో రూ. 140-168, బీ గ్రేడ్ రూ.118-138 వరకు పలికాయి. నిన్న కేజీ రూ.140 ఉన్న కిలో టమాటా ధర ఇవాళ ఈ స్థాయిలో పెరగడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. కాగా వర్షాలు కురిసి పంట దిగుబడి తగ్గడంతో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
* సక్సెస్‌ను పట్టేసిన అంబానీ
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే
* అదానీ గ్రూప్ నుంచి క్రెడిట్ కార్డ్!
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నుంచి త్వరలో క్రెడిట్ కార్డు రానుంది. అమెరికాకు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసాతో అదానీ గ్రూప్ జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి త్వరలోనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ సర్వీస్, రిటైల్, ఆన్లైన్ ట్రావెల్ సేవలను ఉపయోగించుకునేలా ఈ కార్డును తీసుకురానున్నట్లు వీసా సీఈవో ర్యాన్ మెక్ నేర్నీ తెలిపారు.
* ఒకటి కంటే ఎక్కువ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా?
సరికొత్త అవకాశాలు, మెరుగైన జీతాలు ఆశిస్తూ ఇతర ఉద్యోగాలకు వెళ్లటం సహజమే. అయితే ఇలా ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ఈపీఎఫ్ (EPF) ఖాతాలు తెరుస్తారు. కానీ, వాటిని విలీనం చేయరు. ఎలా విలీనం చేయాలో తెలియక కొందరు.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియక మరికొందరు దీన్ని విస్మరిస్తుంటారు. ఒకవేళ మీకూ వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలుంటే వాటిని ఎలా విలీనం చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల వల్ల ఉండే ఇబ్బందులేంటో చూద్దాం.ఓ వ్యక్తి వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పటికీ వారికి ఒకటే యూఏఎన్ (UAN) ఉంటుంది. యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. మరో విధంగా చెప్పాలంటే ఆధార్ సంఖ్య లాంటిదన్నమాట. ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక యూఏఎన్ కేటాయిస్తారు. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ యూఏఎన్ నంబర్ కిందే ఆయా సంస్థలు వేర్వేరు ఖాతాలను తెరుస్తాయి. అయితే, ఈపీఎఫ్ నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ యూఎన్ నంబర్లు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నా ఎలాంటి పెనాల్టీలూ విధించరు. వేరే సంస్థలో ఉద్యోగంలో చేరితే పాత యూఏఎన్ నంబర్‌నే ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ సూచిస్తోంది.
* LIC సూపర్ స్కీమ్
ప్రముఖ ప్రభుత్వ భీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్ లను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందిస్తుంది..అదే ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ.. ఇది నాన్ లింక్డ్, పర్సనల్, పొదుపు ప్లాన్ పాలసీ. దీనితో పాటు, పాలసీ హోల్డర్ మరణంపై హామీ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది.. ఈ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవ శాత్తు మరణిస్తే అతని కుటుంబానికి బీమా మొత్తంలో కనీసం 105 శాతం లభిస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ లాబ్ అనేది ప్రాథమిక ఎండోమెంట్ ప్లాన్. దీనిలో మీరు అనుకున్న కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించాలి. ఇది కాకుండా, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూరిటీ ప్రయోజనం లభిస్తుంది.ఇది కనీసం రూ. 2 లక్షల హామీ మొత్తాన్ని పొందుతుంది. అదే సమయంలో, గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ఈ పాలసీలో మీరు 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ పాలసీలో 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 59 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు 16 సంవత్సరాల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.. ఇక గరిష్ట మెచ్యూరిటీ కాలం 75 ఏళ్లు ఉంటుంది.ఇకపోతే ఈ పాలసీకి ప్రీమియం నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా చెల్లింపులు చేయవచ్చు. మీరు ప్రతిరోజూ రూ. 253 లేదా ప్రతి నెల రూ. 7700 ఇన్వెస్ట్ చేస్తే, ఒక సంవత్సరంలో రూ. 92400 ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు 25 సంవత్సరాల తర్వాత రూ. 54 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు లేదా.. ఎల్ఐసీ ఆఫీస్ వెళ్లి తెలుసుకోవచ్చు.. ఇవే కాదు ఎన్నో పథకాలను ఈ భీమా సంస్థ అందిస్తుంది.. అవన్నీ కూడా ప్రజాదారణ పొందిన పథకాలే.. రాబడి ఎక్కువ ..అస్సలు రిస్క్ ఉండదు.
* భారీగా తగ్గిన చికెన్ ధర
ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. టమాట ధర మాత్రం ఏ మాత్రం దిగి రావడం లేదు. ఇక హైదరాబాద్‌లో కిలోకు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఇక వాతావరణంలో మార్పులతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల చికెన్ ధరలు సైతం ఆకాశన్నంటాయి. కానీ ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. నెల రోజుల కిందట కిలో చికెన్ ధర రూ.280 నుంచి రూ.320 వరకు ఉండగా, తాజాగా భారీగా దిగి వచ్చింది.తాజాగా స్కిన్‌లెస్ కిలో రూ.200 వరకు ఉండగా, లైవ్ కోడి ధర 130 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పలుకుతోంది. ఇక స్కిన్‌తో ఉన్న చికెన్ ధర 180 రూపాయల నుంచి 190 రూపాయల వరకు ఉంది. పెరుగుతున్న కూరగాయల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా చికెన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి.ఇక నెల రోజులుగా టమాట ధరలు పరుగులు పెడుతున్నాయి. కిలో టమాట ధర 180 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో దోరగా ఉన్న టమాట ధర రూ150 వరకు ఉంది. ఇక రైతు బజార్లో మాత్రం కిలో రూ.75 వరకు ఉన్నా.. సంతల్లో మాత్రం అధికంగానే విక్రయిస్తున్నారు. అయితే టమాట ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.
* లాభాల్లోకి టాటా మోటార్స్
ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది.లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది.