DailyDose

వానలు ఎన్ని రకాలో తెలుసా?

వానలు ఎన్ని రకాలో తెలుసా?

ఝల్లు ఝల్లుగా వాన, తుంపర తుంపరులుగా వాన, పూల ఝల్లు కురిసినట్లుగా వాన ఇలా వాన, తొలకరి జల్లులుగా వాన.. ఇలా ఎన్నో రకాల వానలున్నాయని మీకు తెలుసా..? ఈ సమస్త జీవరాశులకు ఆహారం లభించాలంటే వానలు పడాలి. పంటలు పండాలి. పచ్చదనం నిండాలంటే వానలు పడాలి. అటువంటి వానల్లో ఎన్నో రకాలున్నాయి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. వాటికి అర్థాలు కూడా ఉన్నాయని చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు. వానల్లో దాదాపు 25 రకాలున్నాయని పెద్దలు చెబుతుంటారు. మరి ఆ వానల పేర్లు ఏంటో.. వాటి అర్థాలేంటో తెలుసుకుందామా.

1. గాంధారివాన : కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వానను గాంధారీ వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు కురిసే పెద్దవాన ను గాంధారి వాన అంటారు.

2. మాపుసారివాన: సాయంత్రం సమయాల్లో కురిసే వాన..పొద్దుగూకి వచ్చిన చుట్టం పొద్దుగూకాల వచ్చినవాన పోదు అంటారు పెద్దలు..

3. మీసరవాన : అంటే తొలకరిలో మృగశిరకార్తెలో కురిసే వాన…మృగశిర కార్తె వచ్చింది అంటే విత్తనాలు నాడుతారు. వరిపంటలతో పాటు పలు రకాల కూరగాయల విత్తులు నాటుతారు. కూరలకు, సాంబారుకు మంచి రుచి తెచ్చే మునక్కాయ గురించి చెప్పాలంటే మృగశిరకార్తెలో కురిసే వాన గురించి చెప్పాల్సిందే. మృగశిరకార్తె వచ్చిన మూడు రోజులకు మునక విత్తనం నాటితే మూడు నెలలకు మునగ కాయలు కాస్తుందని పెద్దలు చెబుతుంటారు.

4. దుబ్బురువాన : తుంపర తుంపరగా కురిసే వానని దుబ్బురు వాన అంటారు. తుంపరులుగా వాన జల్లు పడుతుంటే భలే సరదాగా ఉంటుంది. చిన్నారులు సరదాగా తడిసే వాన.

5. సానిపివాన : అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన. అంటే ఇలా జలజలా రాలి కాసేపటికే తగ్గిపోతుంది.

6. సూరునీల్లవాన : ఇంటి చూరు నుండి ధార పడేంత వాన..అప్పట్లో ఇళ్లు తాటాకులతో నేసి దానిపై ఎండుగడ్డితో నేసేవారు. వాన చుక్క కూడా ఇంటిలోపలన పడేది కాదు. కురిసినవానంత ఇంటి చూరు నుంచి కిందకు జలజలా రాలిపోతుంది. అలా జోరుగా కురిసిన వానను సూరునీల్ల వాన అంటారు.

7. బట్టదడుపువాన : ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన. బట్టలు తడిసేంత వరకు కురిసి ఆ తరువాత వెలిసిపోయే వానను బట్టదడుపువాన అంటారు.

8. తెప్పెవాన : ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

8. సాలువాన : ఒక నాగలిసాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన : రెండుసాల్లకు అంటే విత్తనాలకు సరిపడా వాన

11. మడికట్టువాన : బురదపొలం దున్నేటంత వాన…అంటే పొలం దున్నటానికి సరిపడా నీరు కురిసే వాన..

12. ముంతపోతవాన : ముంతతోటి పోసినంత వాన

13. కుండపోతవాన : కుండతో కుమ్మరించినంత వాన

14. ముసురువాన : విడువకుండా కురిసే వాన

15. దరోదరివాన : ఎడతెగకుండా కురిసే వాన

16. బొయ్యబొయ్యగొట్టేవాన : హోరుగాలితో కూడిన వాన

17. రాళ్లవాన : వడగండ్ల వాన

18. కప్పదాటువాన : అక్కడక్కడా కొంచెం కురిసే వాన

19. తప్పడతప్పడవాన : టపటపా కొంచెంసేపు కురిసి వెలిసిపోయే వాన.

20. దొంగవాన : రాత్రంతా కురిసి తెల్లారేసరికి వెలిసిపోయి కనిపించని వాన

21. కోపులునిండేవాన : రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన : ఏకధారగా కురిసే వాన

23. మొదటివాన : విత్తనాలకు బలమిచ్చే వాన

24. సాలేటివాన : భూమి తడిసేంత భారీ వాన….బీటలు వారిన నేల మీద కూడా నీరు నిలించేంత వాన.

25. సాలుపెట్టువాన : పొలంలో దుక్కుదున్నటానికి సరిపోయేంత వాన

అలా వానకాలం వచ్చిందనే సంకేతంగా తొలకరి జల్లు పడినప్పటి నుంచి రైతులు వ్యవసాయం చేయటానికి రెడీ అయిపోతారు. విత్తనాలు నానవేయటం,మొలకలు కట్టటం. అవి మొలకలు వచ్చేసరికి పొలాన్ని తయారు చేసి విత్తనాలు జల్లటం అలా రైతన్న మట్టికి అంకితం అయిపోతాడు. బంగారు పంటలు పడిస్తాడు. నాగలి భుజానేసి పొలాలకు బయల్దేరుతారు. దీన్నే అరకదున్నటం అంటారు.దుక్కి దున్ని పంటలు వేస్తారు. వరుణ దేవుడికి మొక్కులు సమర్పిస్థారు. అందుకే రైతుకు వర్షానికి అవినావ భావం సంబంధం ఉదంటారు. తొలకరి కురిస్తే చాలు రైతన్న గుండెల్లో కోటి వీణలు మోగుతాయి.అయితే ఒక్కో రకం వానకి ఒక్కో పేరుంది. పల్లెల్లో రైతులు వీటిని పిలుస్తుంటారు. ఈ వానల పేర్లు బహుశా ఇప్పటి జనరేషన్ వారికి తెలియవు. వానల్లో కూడా రకాలు ఉంటాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది.