* శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,147 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు చేకూరింది.
* విజయవాడలో విరిగిన కొండచరియలు
విజయవాడలో కొండచరియలు స్థానికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇంద్రకీలాద్రితో పాటు కస్తూరిబాయ్ పేటలో రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండచరియలు నాలుగు ఇళ్లపై పడి.. ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. వరుసగా కొండచరియలు విరిగిపడుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కొండప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉత్తరరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతరాత్రి ( జులై 25) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి.లబ్బీపేటలోని కస్తూరిబాయి పేట ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడటంతో.. నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు లేక అవస్థలు పడుతున్నామని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. వర్షపునీరు డ్రైనేజీల ద్వారా వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* అవిశ్వాస తీర్మానంపై కిషన్ రెడ్డి స్పందన
కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మూడు పార్టీలు పలుసార్లు తెలంగాణను పాలించాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ తో పోరాటం చేస్తుందని… బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని చెప్పారు.
* పొందూరు వసంత్ మృతికి సంతాపం
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ సారి బలమైన ముద్రను వేయాలన్న కసితో జనసేన అధినేత వారాహి యాత్రతో విస్తృతంగా ప్రజల మధ్యన మీటింగ్ లను పెడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా స్పందిస్తూ ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు గ్రామానికి చెందిన వసంత్ కుమార్ విద్యుత్ షాక్ వలన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు.. ఈయన మాట్లాడుతూ జనసేన నేత వసంత్ కుమార్ మృతి మా పార్టీలో ఉన్న నేతలందరికీ చాలా లోటు అన్నారు. ఈ గ్రామంలో కరెంట్ తీగలు వేలాడుతున్నాయని పలుమార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా పట్టించుకోలేదని తన బాధను తెలియచేశారు పవన్. అయితే స్థానికంగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో ఈ కరెంట్ తీగలు వేలాడే దృశ్యాన్ని వీడియో తీయాలని ప్రయతించిన వసంత్ కుమార్ ప్రమాదవ శాత్తూ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడ మరణించారు అని బాధపడ్డారు పవన్ కళ్యాణ్.వసంత్ కుమార్ మృతికి పార్టీ అంతా సంతాపాన్ని తెలియచేస్తోంది.. అంతే కాకుండా ఈ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తాం అంటూ ప్రకటించారు.
* ఆ ఊరి శివారులో చిరుతల సంచారం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని శివారు కొండ ప్రాంతంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. కొండ ప్రాంతంలోకి వెళ్లిన గొర్రెల కాపరులు, పశువుల కాపరులకు చిరుత కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. కొండపై చిరుత సంచారాన్ని గొర్రెల కాపరులు సెల్ ఫోన్ లో రికార్డు చేసి…అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు… కళ్యాణదుర్గం శివారులో గోశాలకు సమీపంలో కొండ ప్రాంతానికి చిరుతలు చేరాయి.గతంలో చాలాసార్లు శివారు ప్రాంతంలో చిరుతలు సంచారం చేశాయని…. తమకు రక్షణ కల్పించాలని గోశాల నిర్వాహకులు కోరుకుంటున్నారు. మరోవైపు గూబనపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డుపై కారులో వెళుతున్న వారికి మరో చిరుత కనిపించడంతో దాన్ని కూడా సెల్ ఫోన్ లో బంధించారు…. కొద్ది సమయంలోనే కళ్యాణదుర్గం చుట్టుపక్కల రెండు చిరుతలు తారసపడడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు..
* పవన్ పెళ్లిళ్లపై మీకేంటి నొప్పి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వైఎస్ జగన్‌కు తరచూ పెళ్లాల గురించే మాట్లాడటం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మూడు పెళ్లిళ్లు తప్పు అని పదేపదే చెప్తున్న వైఎస్ జగన్.. సొంత బాబాయిని హత్య చేయడం తప్పు కాదా? అని నిలదీశారు. హత్యలు ప్రమాదమా… మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? అనేది తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. బాబాయిని చంపడం తప్పు కాదని చెబుతారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిలదీశారు. అసలు పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు గురించి వైఎస్ జగన్‌కు ఎందుకంట అని సెటైర్లు వేశారు. పవన్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన హోదాను మరచి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పరమైన అంశాలతో ఎవరినైనా విమర్శించ వచ్చని..కానీ వ్యక్తిగత దూషణలు మాత్రం సరికాదన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో దాన్ని నుంచి తప్పించుకునేందుకు జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం చేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్లోలో మాట్లాడేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కుప్పం పర్యటనలో సీఎం జగన్ ఇచ్చిన హామీని గుర్తుచేసే ప్రయత్నం చేశారు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పబోయి… ముఖ్యమంత్రిని చేస్తారని మంత్రి నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఏపీ సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే కుప్పంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి తరుచూ కుప్పంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
* అధ్యక్షుల మార్పుపై బీజేపీ ఆఫీసులో కార్యకర్తల ధర్నా
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్ ఏకపక్షంగా13మండలాల అధ్యక్షులను మార్చారంటూ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ఆఫీస్ లో ధర్నా చేయొద్దు అంటూ చెప్పేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డితో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది.
* విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన లోక్ సభ స్పీకర్
కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో విపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన ఈ తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. మరోవైపు ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చింది. తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.. అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం తగిన తేదీని నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని తెలిపారు. తీర్మానంపై చర్చించే తేదీని సభ్యులందరికీ తెలియజేస్తానని చెప్పారు. మరోవైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలకు తీవ్ర అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
* భద్రాచలం వద్ద వరద ఉధృతి
ఎగువ నుండి వస్తోన్న వరద, గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలానికి వరద పొటెత్తుతుంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.5 అడుగులకు చేరింది. వరద ఉధృతి పెరగడంతో అలర్ట్ అయిన అధికారులు భద్రాచలం వద్ద మొదట ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. భారీ వరద వల్ల విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం నీట మునిగాయి. గోదావరి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేశారు.