Agriculture

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్

వ్యవసాయరంగానికి సంబంధించి అన్ని రకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా దేశవ్యాప్తంగా ప్రధాని కిసాన్‌ సేవాకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ఎరువుల దుకాణాలన్నింటినీ కిసాన్‌ సేవాకేంద్రాలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.80 లక్షల కేంద్రాలు ఏర్పాటు కానుండగా.. తొలిదశలో గురువారం 1.25 లక్షల కేంద్రాలు ప్రారంభమవుతాయని చెప్పారు.వీటిలో తెలంగాణలో నాలుగువేల కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కేంద్రాల్లో ఎరువులతో పాటు, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు, సాగుకు అవసరమైన సలహాలు, బీమా తోడ్పాటు, విత్తనాల నాణ్యత, నీటి నాణ్యత, భూసారపరీక్షలు సహా అన్ని సేవలు లభ్యమవుతాయన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగిస్తారని, జిల్లా స్థాయి డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులో ఉంటాయన్నారు. రైతుల సమస్యలు, సాధించిన విజయాలను పంచుకునేందుకు ‘కిసాన్‌ కీ బాత్‌’ రైతుల గ్రూపు సమావేశాలు ప్రతినెలా రెండో ఆదివారం నిర్వహిస్తారని అన్నారు. వాట్సప్‌ గ్రూపుద్వారా రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్లలో ధరల సమాచారం అందుతుందన్నారు.

సేవాకేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఎరువుల శాఖ ఈ బాధ్యత నిర్వహిస్తుందన్నారు. ఇప్పటివరకు దేశంలో వేపపూత ఉన్న యూరియా అందుబాటులో ఉండగా.. ఇకపై సల్ఫర్‌ పూత ఉన్న యూరియా లభ్యం కానుందని తెలిపారు. రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కిసాన్‌ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తారని, 14వ విడత పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు 8.5 కోట్ల మంది రైతులకు విడుదల చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు. దేశంలోని అన్ని బ్రాండ్‌ల ఎరువులు ఇకపై భారత్‌ బ్రాండ్‌ అనే ఒకే పేరుతో చలామణి అవుతాయని, నానో యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలోని శామీర్‌పేటలో సేవాకేంద్రాన్ని తాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కేంద్రాల ప్రారంభంలో భాజపా నేతలు పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్‌, ఎంఐఎం మూడు పార్టీలూ ఒకే తానులోని ముక్కల వంటివని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.