Politics

కెటిఆర్‌కు ISB ఆహ్వానం

కేటీఆర్‌ ISB మొహాలీ ఆహ్వానం

మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ)లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 11న మొహాలీలోని ఐఎస్‌బీ క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలసీ (ఏఎంపీపీపీ) 8వ బ్యాచ్‌ను ప్రారంభించి, ప్రసంగించాలని కోరుతూ ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల ఆహ్వానించారు. ‘ఐఎస్‌బీకి బలమైన మద్దతుదారుగా ఉన్న మీ సహకారం, మార్గదర్శకత్వం అమూల్యమైనవి. మీ మద్దతు మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలి’ అని తన ఆహ్వాన పత్రంలో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ప్రోగ్రాంను అభ్యసించేవారు పబ్లిక్‌ పాలసీలోని వివిధ అంశాలు, దాని రూపకల్పన ప్రక్రియను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం, సలహాలు ఎంతో దోహదపడుతాయి. మీతో సంభాషించడం, మీ దృక్కోణాలను వినడం ద్వారా వారు ఎంతో ప్రయోజనం పొందుతారు’ అని మదన్‌ అన్నారు. ఏఎంపీపీపీ అనేది పబ్లిక్‌, ప్రైవేటు రంగాల్లోని మిడ్‌-కెరీర్‌ నిపుణులకు అందించే ప్రోగ్రాం. టఫ్ట్స్‌ యూనివర్శిటీ సహకారంతో ఐఎస్‌బీకి చెందిన భారతీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఈ ప్రోగ్రాంను రూపొందించింది. భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ ద్వారా దీనికి ఆమోదం లభించింది. కాగా, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఐఎస్‌, రైల్వే తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నాయకులు, ప్రైవేటు రంగంలోని సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ 50 మంది ఇందులో పాల్గొంటున్నారు.