Business

ఆ దేశాల్లో జీతాలు అధికం

ఆ దేశాల్లో జీతాలు అధికం

విదేశాల్లో స్థిరపడాలనే కోరికతోనో.. ఎక్కువ సంపాదించాలనే ఆశతోనే చాలా మంది ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతుంటారు. అలాగే, విదేశాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు కొన్ని సంస్థలు ఉద్యోగులను ఒక దేశం నుంచి మరో దేశానికి పంపుతుంటాయి. తాజాగా, ప్రవాసులు వెళ్లేందుకు ప్రసిద్ధ గమ్యస్థానంగా సౌదీ అరేబియా నిలిచింది. ఈసీఏ ఇంటర్నేషనల్‌ (ECA International) అనే సంస్థ ‘మై ఎక్స్‌పార్షియేట్‌ మార్కెట్ పే సర్వే’ పేరుతో నిర్వహించిన సర్వే ప్రకారం మిడిల్‌ఈస్ట్ దేశాల్లో ప్రవాసులకు ఎక్కువ జీతం లభిస్తున్నట్లు వెల్లడైంది.సౌదీ అరేబియాలోని మేనేజర్లు సగటున ఏడాదికి 83,763 పౌండ్లు (సుమారు రూ. 88.64 లక్షలు) జీతం అందుకుంటున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మూడు శాతం తగ్గినప్పటికీ.. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.. ఇదే అధిక మొత్తమని సర్వే నివేదికలో పేర్కొంది. అలాగే, కంపెనీలు ఉద్యోగులను పంపేందుకు ఖరీదైన దేశంగా బ్రిటన్‌ ఉందని తెలిపింది.

‘‘ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో లేకపోయినా.. సౌదీ అరేబియాలో ప్రవాసులకు ఎక్కువ జీతం లభిస్తోంది. వారిని మిడిల్‌ఈస్ట్‌ దేశాలకు పంపేందుకు ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. అక్కడ వారికి లభించే ప్రయోజనాలు తక్కువగా ఉన్నా.. వ్యక్తిగత పన్ను లేకపోవడంతో వారికి మరింత లబ్ధి చేకూరుతోంది. యూకేలో పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉన్నా, పన్ను చెల్లింపులు అధికంగా ఉండటంతో ప్రవాసులకు లభించే ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయి’’ అని ఈసీఏ ఇంటర్నేషనల్‌లో సర్వే మేనేజర్‌గా పనిచేస్తున్న ఓలివర్‌ బ్రౌన్‌ తెలిపారు.యూకేలో సగటున ఒక ప్రవాసుడికి జీతం.. పన్ను చెల్లింపులు, ఇంటి అవసరాలు, పిల్లల చదువులు వంటి వాటితో కలిపి ప్యాకేజీగా 441,608 డాలర్లు (సుమారు రూ. 3.62 కోట్లు) ఇస్తున్నారు. ఈ మొత్తంలో కేవలం 18 శాతం మాత్రమే ఉద్యోగి చేతికి అందుతున్నట్లు సర్వే పేర్కొంది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హాంకాంగ్‌ మూడు స్థానాలు పైకి ఎగబాకి ప్రపంచంలోనే ఐదో ఖరీదైన ప్రాంతంగా నిలిచిందని తెలిపింది. సింగపూర్‌ 16వ స్థానంలో ఉండగా.. జపాన్‌, భారత్‌, చైనాలు వరుసగా.. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.