విశాఖపట్నానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం మంజూరైంది. కైలాసగిరిపై దీనిని ఏర్పాటు చేయనున్నారు. గత ఆరు నెలలుగా దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖ వివిధ నగరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియాలు ఏర్పాటుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటికి కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులు మంజూరుచేస్తోంది. విశాఖలో ఎకరా విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఏర్పాటుకు ఏపీ సైన్స్ సిటీ అధికారులు ముందుకు వచ్చారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌తో దీనిపై చర్చించారు. కైలాసగిరిపై ప్లానిటోరియం ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో…సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియానికి అవసరమైన భూమి ఇవ్వడానికి అంగీకరించారు. దాంతో వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి ఢిల్లీకి పంపించారు. మొత్తం రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేంద్రం రూ.4.69 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో రూ.3,75,20,000 గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా మంజూరుచేసింది.
ఏమేమి ఉంటాయంటే..?కైలాసగిరిపై ఏర్పాటయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలో 3డి ఆర్ట్ గ్యాలరీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, సిలికా విగ్రహాలు పెడతారు. పిల్లలకు సైన్స్, సాంకేతిక అంశాలపై ఆసక్తి కలిగే పలు అంశాలను ప్రదర్శిస్తారు. మేఘాలు ఎలా ఏర్పడతాయి?, విండ్ పవర్ ఎలా ఉత్పత్తి అవుతుంది?,…తదితరాలు పిల్లలకు అర్థమయ్యేలా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అంతా ఏపీ సైన్స్ సిటీయే చూసుకుంటుంది. ఈ నిధులకు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వడానికి ఇస్రో ముందుకు వచ్చిందని వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. మ్తొతం ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. తొలి ఐదేళ్లు ఏపీ సైన్స్ సిటీ ప్రతినిధులే దీనిని నిర్వహిస్తారు. సందర్శకుల నుంచి ప్రవేశరుసుము వసూలు చేస్తారు. అందులో 50 శాతం సైన్స్ సిటీ తీసుకొని మిగిలిన 50 శాతం వీఎంఆర్‌డీఏకి ఇస్తుంది. ఐదేళ్ల తరువాత ప్రాజెక్టు మొత్తం వీఎంఆర్‌డీఏకి అప్పగిస్తారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఏపీ సైన్స్ సిటీ సీఈఓ జయరామిరెడ్డి తెలిపారు.