DailyDose

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి నది మహోగ్ర రూపాన్ని తలపిస్తుంది. రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల మేర ప్రవహిస్తున్నది. మధ్యాహ్నం 44 అడుగులు దాటగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.మరోవైపు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఇంకా గోదావరి ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద చేరేవరకు ప్రజలు వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూమూలకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో ఇంకా గోదావరిలో ఇంకా ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. అన్నదాన సంత్రంలోకి వాన నీరు వచ్చింది. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నుండి 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పినపాక మండలం కరకగూడెంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. ములకలపల్లి మండలంలో వాగుతుండగా మహిళ గల్లంతయ్యింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.