NRI-NRT

సింగపూర్‌లో తెలుగు నీతి పద్య పోటీలు

సింగపూర్‌లో తెలుగు నీతి పద్య పోటీలు

తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా సింగపూర్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు మాతృభాషను మరిచిపోరాదనే సంకల్పంతో భాషకు ఆయువుపట్టుగా నిలిచే వేమన, సుమతీ శతకాల నీతి పద్యాల ద్వారా భాషపై అవగాహన పెంచడానికి, మంచి చెడులు నేర్పించడానికి సింగపూర్‌ తెలుగు టీవీ వారు తెలుగు తోరణం అనే పేరుతో నీతి పద్య పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు వృత్తాలుగా, పది ఎపిసోడ్‌లలో నిర్వహించే ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి వృత్తంలోని నాలుగు భాగాలను గత ఆదివారం సింగపూర్‌ సివిల్ సర్వీస్ క్లబ్‌లో నిర్వహించగా 20 మంది చిన్నారులు పాల్గొని నీతి పద్యాలను చెప్పి భావాన్ని అర్థవంతంగా వివరించారు. సింగపూర్‌లో మొట్టమొదటి తెలుగు రియాల్టీ షోగా ఈ కార్యక్రమం తెలుగు భాషాభివృద్ధికి ఒక మంచి ప్రయత్నంలా, ఒక ముందడుగులా ఉంటుందని కార్యక్రమానికి విచ్చేసిన పలువురు తెలుగు ప్రముఖులు ప్రశంసించారు. పోటీలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందించడంతో పాటు పాల్గొన్న ప్రతి చిన్నారికీ పెద్దబాలశిక్ష పుస్తకాన్ని అందించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అన్నారు. తెలుగు మూలాలను పిల్లలకు గుర్తుచేయడానికి పెద్దబాలశిక్ష ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి విన్నూత్న ఆలోచన చేసిన సింగపూర్‌ తెలుగు టీవీ వారికి కృతజ్ఞతలు చెప్పారు. సింగపూరు తెలుగు టీవీ వ్యవస్థాపకులు రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయనీ గణేశ్న మాట్లాడుతూ.. తెలుగు భాషపై ఉన్న ఎనలేని మమకారమే ఇలాంటి ప్రయత్నానికి తమను ప్రేరేపించిందని చెప్పారు. నీతి పద్యాల పోటీ ఏదో ఒక చిన్న పోటీలా కాకుండా, తెలుగు రియాలిటీ షోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సింగపూర్‌ తెలుగు ఖ్యాతిని పెంచేలా ప్రయత్నం చేశామని.. అందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎందరో స్నేహితులు ముందుకు వచ్చి చక్కగా జరిగేలా ప్రోత్సాహం అందించారన్నారు. రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ తొలి రౌండ్‌ పద్య పోటీలకు శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడప, తాస్ అధ్యక్షులు అనితా రెడ్డి, సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా, రాధిక, సౌజన్య, శ్రీకాంత్, మాధవి అతిథులుగా హాజరయ్యారు. సుబ్బు వి. పాలకుర్తి, కవిత కుందుర్తి వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా శ్రీరాం, చంద్రు, రజనీకాంత్‌ సాంకేతిక సహకారం అందించారు. వేదిక పర్యవేక్షణ కళ్యాణ్ చక్రవర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమం సింగపూరు తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా ప్రతి శనివారం ఒక భాగం మొత్తం 10 భాగాలుగా విడుదలవుతుందని నిర్వాహకులు తెలిపారు.