తెలంగాణపై వరుణుడి దాడి కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు ( శుక్రవారం) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలు, వరద తీవ్రతపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రతను ప్రగతి భవన్ నుంచి ఎప్పటికిప్పుడు సీఎం పర్యవేక్షిస్తున్నారు. వరద తాకిడి గురయిన భూపాలపల్లి జిల్లా మొరంచపల్లెకు ఆర్మీ హెలికాప్టర్ పంపాలని సీఎం ఆదేశించారు. ఆర్మీని సంప్రదించాలని సీఎస్‌కు సూచించారు సీఎం. ఆర్మీ అధికారులతో సీఎస్ శాంతకుమారి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది అధికారులని అక్కడికి పంపేందుకు చర్యలు చేపట్టారు. మరోవూపు వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
భూపాలపల్లి జిల్లా మొరంచ గ్రామం దగ్గర వాగు ఉధృతి 15 అడుగులకు పెరగడంతో గ్రామస్థులంతా డాబాలపై తలదాచుకుంటున్నారు. 15 వందల మంది గ్రామస్థులు మూటాముళ్లె సద్దుకుని భవనాలపైకి ఎక్కారు. సాయం అధికారులను వేడుకుంటున్నారు. వరద ఉధృతికి ఇప్పటికే నలుగురు కొట్టుకుపోయారు. వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. మొరంచపల్లెకు చేరుకున్న రెస్క్యూ టీం.. సహాయకచర్యలు ముమ్మరం చేసింది. మొరంచవాగు ఉధృతితో అల్లాడుతున్న గ్రామాన్ని ఎమ్మెల్యే గండ్ర పరిశీలించారు. కళ్లెదుట సాగుతున్న వరద బీభత్సాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. వరదలో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడేందుకు అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
మరో రెండు రోజులు వర్షం కొనసాగనుంది. నిర్మల్ జిల్లా కడెంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద ఉదృతితో కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యామని ఆవేదన చెందారు. ఏడాదిక్రితం మరమ్మతులకు గురైన ప్రాజెక్టు గేట్లకు నేటికి అతీగతి లేదన్నారు. ఇప్పటికీ మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ.. మంత్రితోపాటు ఎమ్మెల్యే రేఖానాయక్‌ను ఘెరావ్ చేశారు. పునరావాస కేంద్రంలో పిల్లలకు భోజన వసతి కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం గేట్ల పై నుండి వరద నీరు పారుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకుగాను 706 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు గేట్ల పై నుండి వరద నీరు పొంగి పొర్లుతోంది. మొత్తం 6 లక్షల 40 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహించడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో వరద ప్రవాహం ఇంకా పెరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంచిర్యాలలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఎన్టీఆర్ నగర్, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్ వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా మంచిర్యాల పట్టణానికి వరద పోటెత్తుతోంది.