రష్యాపై ఎదురుదాడికి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు 40 కోట్ల డాలర్ల ప్యాకేజీని మంగళవారం వాషింగ్టన్ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలిసారి బ్లాక్ హార్నెట్ నిఘా డ్రోన్లను ఉక్రెయిన్‌కు అందించనుంది. ఇందుకోసం ఏప్రిల్‌లోనే నార్వేకు చెందిన ఎఫ్‌ఎల్‌ఐఆర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్‌కు 9.3 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టును అమెరికా ఆర్మీ అప్పగించింది. హార్నెట్ సిస్టమ్‌లో జాయ్‌స్టిక్ వంటి కంట్రోలర్, రెండు డ్రోన్లు ఉంటాయి. ఒక్కో డ్రోన్ బరువు 33 గ్రాములు. దీంతో సైనికులు వీటిని తేలిగ్గా తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఈ డ్రోన్లు 25 నిమిషాలపాటు ప్రయాణించగలవు. గంటకు 28 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకొని ఇవి పనిచేయగలవు. శత్రు స్థావరాల్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి తక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాలను, వీడియోలను రెండు కి.మీ. దూరంలోని కంట్రోల్ స్టేషన్‌కు పంపించగలవు.