కరెన్సీ నోట్లపై (currency note) స్టార్ (*) సింబల్ ఉండడంపై ఇటీవల సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పేర్కొంటూ పోస్టులు పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా ఆర్‌బీఐ (RBI) స్పష్టతనిచ్చింది. అవి నకిలీవి కావని, అవి కూడా ఆర్‌బీఐ జారీ చేసిన నోట్లేనని పేర్కొంది. ఇతర నోట్లలానే అవి కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది.ఆర్‌బీఐ వివిధ రకాల నోట్లను జారీ చేస్తుంది. సాధారణంగా వాటిపై సీరియల్ నంబర్ ముద్రించి ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్ సింబల్ ముద్రించి ఉండడం గమనించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. అన్ని ఇతర నోట్లలానే అవి కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ప్రిఫిక్స్, సీరియల్ నంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని తెలిపింది.
స్టార్ సింబల్ గుర్తు అంటే.. దాన్ని రీప్లేస్ చేసిన, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించానికి ఈ స్టార్ సింబల్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచారం పట్ల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైతం స్పందించింది. అవేవీ నకిలీ నోట్లు కాదని, ప్రచారం పట్ల భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. 2016లో ఆర్‌బీఐ జారీ చేసిన 500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉందని గుర్తుచేసింది.