నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ)ని ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. 18 చక్రాలు ఉండే ఈ ఏటీవీకి ‘ఫ్లయింగ్ ఐబ్రో’ అని పేరుపెట్టారు. ఇది అన్ని రకాల ప్రదేశాల్లోనూ దూసుకుపోగలదని కంపెనీ వెల్లడించింది. గత ఏడాదే ఈ ఏటీవీ ప్రొటోటైప్‌ని విడుదల చేసినప్పటికీ.. అక్టోబర్‌లో దీని లేటెస్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. బ్యాటరీతో నడిచే ఈ ఏటీవీ పర్యావరణ హితం కూడా. ఇందులో ఇన్నొవేటివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నది. 18 వీల్స్‌లో ప్రతిదాంట్లోనూ విడిగా ఎలక్ట్రిక్ మోటార్లు బిగించారు.45 సెంటీమీటర్ల ఎత్తు ఉండే రాళ్లపైనా, పడిపోయిన చెట్లపైనా తమ ఏటీవీ ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ‘మెట్లపైన కూడా మా వెహికిల్ దూసుకుపోగలదు. భూమిపై మరే వాహనానికి ఇది సాధ్యం కాదు’ అని పేర్కొన్నది. నేలపై తమ వాహనం తక్కువ ప్రెజర్నే కలుగజేస్తుందని, కాబట్టి మట్టి, గడ్డి, పచ్చికకుగానీ ఎలాంటి నష్టం జరుగదని తెలిపింది.