* హైదరాబాద్‌కు మళ్లీ అతి భారీ వర్ష సూచన
తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది
* జలదిగ్భంధంలో మేడారం
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్సాలకు రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో వున్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ వుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతని కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు.. కడెం ప్రాజెక్ట్ మరోసారి అధికారులు, ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన వున్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతోంది.దీంతో వచ్చిన వరదను వచ్చినట్లగా 14 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు.
* నల్లదుస్తులతో ఇండియా కూటమి ఎంపీల నిరసన
మణిపూర్ హింసపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ. ఇండియా కూటమి ఎంపీలు నల్ల దుస్తులతో పార్లమెంట్కు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశమైన నేతలు నేడు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మణిపూర్ అల్లర్లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు అందజేశారు.
* మూసీ నదికి పెరిగిన వరద ప్రవాహం
నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు
* తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు
తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.జయశంకర్ జిల్లా చిట్యాల్ మండలం చిట్యాల్ 616.5 మి.మీలతో రెండో స్థానంలో నిలిచింది. అదే జిల్లాలోని ఘన్‌పూర్ మండలం చెల్పూర్‌లో 475.8 మి.మీ, రేగొండ మండలంలో 467.0 మి.మీ, మొగుళ్లపల్లిలో 394 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 390 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, హన్మకొండ, ఆదిలాబాద్, వరంగల్, జనగాం జిల్లాల్లోని పలు ప్రాంతాలు సహా 20 చోట్ల 230 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
* ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిందే: స్టాలిన్
ఎన్డీఏ కూటమిని ఓడించి తీరాల్సిందేనని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రాకూడదన్నదే ప్రధాన అంశమని తెలిపారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశం ముక్కలైందని, మణిపూర్లో హింసాకాండ చెలరేగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.
* TS:ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పొడిగింపు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మేరకు పొడిగించారు.జులై 31 తర్వాత అడ్మిషన్లు పొందే విద్యార్ధులు ఆలస్య రుసుము చెల్లించవల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 1 నుంచి 16 మధ్యలో చేరితే రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక డిగ్రీ ప్రవేశాలకు నిర్వహిస్తోన్న దోస్త్ మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును జులై 28 వరకు పొడిగించారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.
* హైకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు మళ్లీ చుక్కెదురు
కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ రెండు రోజుల కిందట హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు విషయంలో స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని, ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని 25న హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికలో రెండో అభ్యర్థిగా నిలిచిన జలగం వెంకట్రావునే 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశించింది.
* బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు నోటీసులు
బిగ్ బాస్ షో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ షో యువతను తప్పుదోవ పట్టిస్తోందని, నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రియాల్టీ షోల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హోస్ట్ నాగార్జునతోపాటు ఛానెల్కు నోటీసులు జారీ చేసింది.
* విద్యార్ధుల హాజరు శాతానికి కూడా మార్కులు
కేవలం పాఠాలు చెప్పడం, రాత పరీక్షలు జరిపి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం మాత్రమేకాకుండా హాజరుకూ మార్కులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) చేసిన సిఫార్సు చేసింది. విద్యార్ధులను 360 డిగ్రీల్లో పరీక్షించేలా కార్యచరణ రూపొందించాలని తన సిఫార్యుల్లో పేర్కొంది. నైపుణ్యాలు అలవడేందుకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, చర్చలు, క్విజ్‌లు లాంటి వాటికి పెద్దపీట వేయాలి తెల్పింది.విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి 8 నెలల క్రితం ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల వీసీలు, డిగ్రీ అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపిన అనంతరం ఇటీవలే ఆయా సిఫార్సులతో కూడిన నివేదికను ఉన్నత విద్యామండలికి ఐఎస్‌బీ అందజేసింది. ఉన్నత విద్యామండలి అధికారులు దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై త్వరలో విద్యాశాఖ మంత్రితో చర్చించి అమలుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా ఐఎస్‌బీ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 258 మంది కాలేజీల అధ్యాపకులు, 692 మంది విద్యార్థుల అభిప్రాయాలను సర్వే రూపంలో సేకరించి ఈ సిఫార్సులు చేసింది.
* శంషాబాద్‌లో ‘ఖతార్’ విమానం అత్యవసర ల్యాండింగ్
దుబాయ్ నుంచి నాగ్‌పుర్ వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. నాగ్‌పుర్‌లో వాతావరణం అనుకూలించక విమానం ఇక్కడ ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. విమానంలోని 160 మంది ప్రయాణికులను అధికారులు నోవాటెల్‌కు తరలించారు
* ఢిల్లీపై బిల్లు విషయంలోనూ ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్
ఢిల్లీలో సేవలపై పట్టు సాధించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదానికి వైసీపీకి చెందిన ఈ తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఎన్డీఏకు కలిసిరానుంది. కాగా.. విపక్షాల కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా వైసీపీ వ్యతిరేకంగా నిలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు, ఢిల్లీ బిల్లుకు ఆమోదం పొందేందుకు తాము అనుకూలంగా ఓటేస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023కు లోక్ సభలో సునాయాసంగా ఆమోదం పొందనుంది. ఎందుకంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఎగువ సభలో అవసరమైన దాని కంటే ఎక్కువ సంఖ్యలోనే సభ్యులు ఉన్నారు. కానీ రాజ్యసభలో ఎన్డీఏకు అంతగా మెజారిటీ లేదు. అనేక సందర్భాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఈ పెద్దల సభలో ఆమోదం పొందడం సవాలుగా మారింది. అయితే ఈ సారి ఎన్డీఏకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో రాజ్యసభలో వివాదాస్పద ఢిల్లీ నియంత్రణ బిల్లు ఆమోదం పొందటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఎంపీలు, వాటి మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, ఇతర చిన్న భాగస్వామ్య పక్షాలతో సహా మొత్తంగా ఎన్డీఏకు 123 ఓట్లతో కూడిన మెజారిటీ ఉంది. అయితే వైసీపీతో పాటు తొమ్మిది మంది ఎంపీలున్న ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ ఈ విషయంలో తన వైఖరిని ఇంకా ఖరారు చేయలేదు.