రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పర్యటన ఖరారైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని, 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన తర్వాత అనంతపురం జిల్లాకు చంద్రబాబు వస్తారని తెలిపారు. 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారని తెలిపారు. రాయలసీమ భవిష్యత్‌తో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను సీఎం జగన్ (CM Jagan) ఆపేశారని ఆరోపించారు.ముఖ్యమంత్రి అసమర్ధత వల్ల రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతుందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాయలసీమ జీవనాడి లాంటి హంద్రీనీవా వెడల్పును ఈ ప్రభుత్వం ఆపేసిందని, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తానని చెప్పి టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. జరిగే పనులు ఆపివేసి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లా మనవడునని చెప్పి ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఆపివేసి నయవంచనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎందగట్టెందుకే చంద్రబాబు పర్యటన చేయనున్నారని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు.సాంకేతిక కారణాలు చూపించి రైతుల నోట్లో ఈ ప్రభుత్వం మట్టికొడుతుందని, జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలు, అవినీతిని ఎండగడతామని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.