ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే ఆరోపణలు చేస్తూ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడ్ని అనర్హులుగా ప్రకటించాలని కోరాడు. ఈ పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేశారు.ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారనీ, రాజ్యాంగ నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలు, మార్గదర్శకాలను సిద్ధరామయ్య ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వరుణ అసెంబ్లీ స్థానానికి చెందిన కేఎం శంకర్ శుక్రవారం ఆరోపిస్తూ.. పిటిషన్ దాఖాలు చేశారు. సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో అవినీతి విధానాలకు పాల్పడ్డారని ఆయన అభియోగంగా ఉంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన:కాంగ్రెస్‌కు మెజారిటీ రావడానికి ఐదు హామీల పథకం దోహదపడిందని పిటిషనర్ తెలిపారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేసి ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే .. ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (1) కింద సిద్ధరామయ్యను ఆ యువకుడు సవాల్ చేశారు. ప్రేరేపణలు ఇవ్వడాన్ని చట్టం నిషేధిస్తుందనీ, హామీ కార్డులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య ఎన్నికలల్లో అవినీతి విధానాలకు పాల్పడినట్టు ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గత మేలో జరుగగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేపీని గద్దెదింపింది. ఈ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య గెలిచారు.