తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ప్రాసిక్యూటర్లు కోరిన సెక్యూరిటీ టేపులను సమర్పించడంలో తాను ఎలాంటి తప్పుచేయలేదని పేర్కొన్నారు. రహస్య పత్రాలకు సంబంధించిన కేసులో ప్రాసిక్యూటర్లు తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలు నమోదు చేశారు. సెక్యూరిటీ ఫుటేజీని డిలీట్ చేయాలని ఫ్లోరిడాలోని తన రిసార్టు ఉద్యోగులను ట్రంప్ ఆదేశించినట్టు అందులో ఆరోపించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘ఈ సెక్యూరిటీ టేపులు సమర్పించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ వాటిని అందజేశాం’ అని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేలా ఉద్యోగులను బెదిరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.రిపబ్లికన్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ 2017-21 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో రెండో పర్యాయం అధ్యక్ష పదవికి పోటీచేసినా.. డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2024లో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు.