Business

హైదరాబాద్‌లో విలాస గృహాలకు పెరిగిన గిరాకీ

హైదరాబాద్‌లో  విలాస గృహాలకు పెరిగిన గిరాకీ

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విలాస గృహాల అమ్మకాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో 130% వృద్ధి నమోదైనట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 3,000 విలాస గృహాల విక్రయాలు నమోదు కాగా, ఈ ఏడాది మొదటి 6 నెలల కాలంలో 6,900 ఇళ్ల విక్రయాలు జరిగాయి. రూ.4 కోట్లు, ఆపైన ధర పలికే ఇళ్లను విలాస గృహాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో 14 రెట్లు అధికంగా విలాస గృహాల విక్రయాలు నమోదు కావటం ఆసక్తికరమైన విషయం. గత ఏడాది ఇదే కాలంలో ఇటువంటి 100 ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్‌లో నమోదు కాగా, ఈ ఏడాది మొదటి 6 నెలల కాలంలో 1400 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇదేకాలంలో పుణెలో విలాస గృహాల అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. దిల్లీ ఎన్‌సీఆర్‌లో గత ఏడాది ఇదే కాలంలో 950 ఇళ్లు, ఈ సారి 2,900 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నై, బెంగుళూరు నగరాల్లో పెరుగుదల లేదు. ముంబయి, కోల్‌కతా నగరాల్లో కొంత వృద్ధి కనిపిస్తోంది. ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) విలాస గృహాలపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ విలాస గృహాలకు అధిక గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సీబీఆర్‌ఈ ఇండియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఛైర్మన్‌, సీఈఓ అన్షుమన్‌ మ్యాగజైన్‌ పేర్కొన్నారు. ఈ విభాగంలో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు.