Devotional

నేడు మొహర్రం

నేడు మొహర్రం

ముస్లింల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్‌, హుస్సేన్‌ అనే ముస్లింవీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పండుగే మొహర్రం. జిల్లాలోని ముస్లింలందరూ ఈ పండుగను శనివారం జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అరబిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొహర్రం నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగను పదిరోజులపాటు జరుపుతారు. పీర్‌ అంటే మహాత్ములు, ధర్మ నిర్దేశకులు అని అర్థం. ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. మొహర్రం నెలలో పదిరోజులపాటు అమరులను స్మరించుకుంటూ పదోరోజును అషురదినంగా జరుపుకుంటారు.

మొహర్రం వెనుక గాథ ఇదీ:పద్నాలుగు వందల ఏండ్ల కిందట 60రోజులపాటు జరిగిన యదార్థ ఘటనకు ప్రతిరూపం మొహర్రం పండుగ. ఖలీఫా హజ్రత్‌ ఆలీ తనయులు ఇమామ్‌ హస్సేన్‌, ఇమామ్‌ హుస్సేన్‌. హజ్రత్‌ అలీ తర్వాత ప్రజలు ఇమామ్‌ హస్సేన్‌ను ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అప్పుడు సిరియా ప్రాంతం గవర్నర్‌గా ఉన్న మావియాకు అధికార దాహంతో రాజ్యాధికార కాంక్ష పెరుగుతుంది. దీంతో యుద్ధం ప్రకటించి ఇమామ్‌ హస్సేన్‌ను గద్దె దించాలనుకుంటాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధతో హస్సేన్‌ తన పదవిని త్యజిస్తారు. మావియా కుట్ర ఫలిస్తుంది. అయితే కొద్ది వ్యవధిలోనే హస్సేన్‌ విష ప్రయోగానికి గురై చనిపోతాడు. మావియా తన కుమారుడు యాజిద్‌ను రాజ్యాధికారిగా నియమిస్తాడు.

దీంతో చర్చల ఇమాం హుస్సేన్‌ రాజధాని కుఫాకు బయల్దేరుతాడు. యాజీద్‌కు విషయం తెలిసి హుస్సేన్‌ పరివారాన్ని కర్బల అనే చోట అడ్డగిస్తాడు. తనను రాజుగా అంగీకరించాలంటూ యుద్ధానికి కాలు దువ్వుతాడు. ఆ విధంగా పదిరోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హుస్సేన్‌ పరివారం వీరోచితంగా పోరాడి అశువులు బాస్తారు. హుస్సేన్‌ ఒక్కరే మిగులుతారు. పదోరోజు హుస్సేన్‌ నమాజ్‌లో నిమగ్నమై ఉండగా శత్రువులు దొంగచాటుగా వెన్నుపోటు పొడిచి హత్య చేస్తారు. ఆ విధంగా పదోరోజు షహాదత్‌ను సంతాపదినంగా పాటించాలని హుస్సేన్‌ అనుచర వర్గం ప్రకటించింది. అమరవీరులు ఇమామ్‌ హస్సేన్‌, హుస్సేన్‌ పడిన కష్టాలు త్యాగాలను స్మరిస్తూ పదిరోజులపాటు విషాద దినాలుగా గడుపుతారు. ఈ పదిరోజులపాటు ముస్లిం సోదరులు వారిని స్మరిస్తూ పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పదోరోజు ముగియడంతో ఆ రోజున మొహర్రం జరుపుకుంటారు.

పండుగ ప్రత్యేకం ఇదీ:తెలుగు రాష్ర్టాల్లో మరీ ముఖ్యంగా నిజాంపాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లింలే కాకుండా అన్నివర్గాల ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. మతాల వారీగా ముఖ్యంగా హిందువులు కూడా పీర్ల పండుగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూముస్లింల సామరస్యమే ఇందుకు కారణం. జాతీయ సమైక్యతకు ఆనాడు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు.

నిప్పుల గుండం(హల్వా):పీరీలను మసీదు నుంచి నిప్పుల గుండాన్ని ఏర్పాటుచేసి హసయ్‌ దులా… అంటూ వారి త్యాగాలను స్మరిస్తూ గుండం చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ వారిని స్మరించుకుంటూ ఉంటారు. ఇక్కడ మతాలకు అతీతంగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నిప్పులగుండం చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. వీరందరికీ షరబత్‌ను అక్కడున్న నిర్వాహకులు అందిస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో 7వ రోజు, 9వ రోజు నిప్పలపై నడుస్తూ తమపై ఏమైనా దృష్టశక్తులు ఉంటే దూరం చేసుకోవడం కోసం ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటూ ఉంటారు.

రెండ్రోజులపాటు ఉపవాసం:రంజాన్‌ ఉపవాసాల తరువాత అంతటి నియమనిష్టలు, కఠినమైన ప్రాధాన్యత కలిగిన ఉపవాసాలుగా మొహర్రం తొమ్మిదో రోజు, పదో రోజు వీలుపడని వారు, పదో రోజు, 11వ రోజు ఉపవాసాలను పాటిస్తారు. ఈ ఉపవాసాలను పాటిస్తే ఒక ఏడాదిపాటు చేసిన పాపాలు మన్నించబడతాయని విశ్వసిస్తారు