DailyDose

గవర్నర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలేసి టేకాఫ్ అయిన విమానం-TNI నేటి తాజా వార్తలు

గవర్నర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలేసి టేకాఫ్ అయిన విమానం-TNI నేటి తాజా వార్తలు

హైకోర్టులో అనితకు ఊరట

తెలుగుదేశం పార్టీ నేత నాయకురాలు వంగలపూడి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జనరావు అనే వ్యక్తి ఇంటి ముందు అనిత నేతృత్వంలో తెలుగు మహిళలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ కేసులపై హైకోర్టును అనిత ఆశ్రయించారు. కోర్టులో అనిత తరపున న్యాయవాది సతీశ్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

*  శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

వారాంతం కావడంతో తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న వెంకటేశ్వరస్వామిని 63,932 మంది దర్శించుకున్నారు. 25,862 మంది తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. గురువారం ఒక్క రోజే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది. రేపు, ఎల్లుండి సెలవులు కావడం, వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తారని భావిస్తున్నారు.

గవర్నర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలేసి టేకాఫ్ అయిన విమానం

ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థ సిబ్బంది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం లాన్‌లో ఎదురుచూస్తున్నప్పటికీ, ఆయనను ఎక్కించుకోకుండానే విమానాన్ని టేకాఫ్‌ చేశారు. దీనిపై గవర్నర్‌ ప్రొటోకాల్‌ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ గెహ్లాట్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌ ఏషియా విమానం రాగానే, గవర్నర్‌ లగేజ్‌ని కూడా అందులో ఎక్కించారు. అయితే గవర్నర్‌ టెర్మినల్‌2కు చేరుకునేందుకు ఆలస్యం అయిందని, దీంతో విమానం టేకాఫ్‌ అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో గవర్నర్‌ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు చేరుకోవాల్సి వచ్చింది.ఘటనపై ఎయిర్‌ఏషియా విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. వృత్తిపరమైన అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌ పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నది. గవర్నర్‌ కార్యాలయంతో తమ సంబంధాలకు అత్యంత విలువనిస్తామని తెలిపింది.

వైసీపీలో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్తాయా?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల బలాబలాలపై రకరకాల సర్వేలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటు పార్టీలు సైతం సొంతంగా సర్వేలు చేసుకుంటున్నాయి. టి‌డి‌పి, వైసీపీలు ఎవరికి వారు తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. ఇటు జనసేన సైతం తాము సత్తా చాటుతామని అంటుంది. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ఆయన కూడా సొంతంగా సర్వే చేయిస్తున్నా విషయం తెలిసిందే.ఆ మధ్య కూడా ఆయన తాను సర్వే చేసినట్లు కొన్ని రిపోర్టులని మీడియా ముందు పెట్టారు. అయితే వీటిల్లో ఏ సర్వేలు నిజమవుతాయో చెప్పలేం..ప్రజలు ఎటు వైపు ఉన్నారో ఇప్పుడే సర్వేలు పసిగట్టడం కూడా కష్టమే. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వే అంటున్నారు. తాజాగా రఘురామ కూడా తనకు ఓ సర్వే రిపోర్టు వచ్చిందని చెప్పి మీడియా ముందు ఓ సర్వే గురించి మాట్లాడారు. ఏపీ ఓటర్ మదిలో ఏముంది? అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 2009లో కాంగ్రెస్ విజయం సాధించిందని, అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైసీపీగా మారిందని అన్నారు.ఇక గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీ వేశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి నష్టం చేయనున్నాయని, ముస్లిం మైనార్టీ ఓట్లు రాజశేఖర్ రెడ్డిని చూసి ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లిం సోదరులు కాంగ్రెస్‌కు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా కడపలో ఈ ప్రభావం ఎక్కువ ఉంటునని చెప్పుకొచ్చారు.అలాగే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు అయిన ఎస్సీ , ఎస్టీలో కొంత శాతం మార్పు కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 40 సీట్లు మాత్రమే వచ్చే విధంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతిపక్షాల పొత్తులపై క్లారిటీకి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే బి‌జే‌పికి వైసీపీ మద్ధతు ఇస్తుందనే కోణంలోనే రఘురామ ఇలా చెప్పి ఉంటారు..కానీ అదే బి‌జే‌పితో జనసేన-టి‌డి‌పి పొత్తుకు వెళుతున్నాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం అసాధ్యం. అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోరు. కాబట్టి రఘురామ చెప్పేది ఏది వర్కౌట్ కాదు.

15 మందితో మహారాష్ట్ర బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జిగా కే. వంశీధర్ రావును నియమించారు. అలాగే మరో 15 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్ సీఎం కేసీఆర్ ఉండగా 14 మంది సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు నేషనల్ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారీ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగులు వున్న ప్రవాహం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. వరద తగ్గిందని తొలుత భావించినప్పటికీ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి దిగువకు నీటిని వదులుతూ వుండటంతో భద్రాచలం వద్దకు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం వుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇకపోతే.. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వరద రోడ్లపైకి చేరింది. టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరవళ్ల నేపథ్యంలో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని.. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని జిల్లా కలెక్టర్ సూచించారు. మరోవైపు.. వరద తగ్గుముఖం పట్టడంతో  మోరంచపల్లివాసులు  శుక్రవారం నాడు గ్రామానికి  చేరుకున్నారు. వరద మిగిల్చిన బురదతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వాగు వరదలో గ్రామస్తులు సర్వం కోల్పోయారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇళ్లకు  చేరుకున్న  స్థానికులు  ఒకరినొకరు  పట్టుకుని  ఏడ్చారు. 12 గంటల పాటు వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు గడిపారు. ఈ గ్రామంలో 250 కుటుంబాలు నివాసం ఉంటాయి.

* వర్షాలకు హైదరాబాద్ సిటీయే మునిగిపోయింది: బొత్స

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వంటి సిటీయే మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒకసారి ఆయన విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు. వర్షాల నేపథ్యంలో ముంపుపై విపక్షాలు విమర్శించడం మీదా బొత్స స్పందించారు. వర్షాలకు హైదరాబాదే మునిగిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమన్నారు.అమ్మఒడి సభకు విద్యార్థులను తీసుకువెళ్లడంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై బొత్స స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు రావడంలో తప్పులేదన్నారు. వారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సినిమా యాక్టర్లు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై కోర్టు సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు

జగన్ టార్గెట్‌గా పవన్ మరో స్కెచ్

ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్ర చేసి..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే స్థానికంగా వైసీపీ నేతల అక్రమాలు అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు.ఇలా పవన్ దూకుడు వల్ల చంద్రబాబు వెనుకబడ్డారు. ఏదో వార్ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లు సాగుతుంది. దీని వల్ల టి‌డి‌పి రేసులో వెనుకబడింది. పైగా పొత్తు విషయంలో పవన్ దూకుడుగా ఊన్నారు. తాము చెప్పినట్లే టి‌డి‌పి వినాలి అన్నట్లు ఉన్నారు. ఇలాంటి పరిణామాలు టి‌డి‌పికి ఇబ్బందిగా మారాయి. ఇక ప్రజల్లో ఉన్నప్పుడే కాదు. సోషల్ మీడియా వేదికగా కూడా పవన్..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ మధ్య బైజూస్ అంశంపై విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలు మిస్ అవ్వడంపై కేంద్రం ఇచ్చిన నివేదికతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు.ఇప్పుడు వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక వారిని ఆదుకోవాలని చెబుతూనే..వైసీపీ జగనన్న కాలనీల్లో అక్రమాలు చేసిందని, కోట్లకు కోట్లు వైసీపీ నేతలు నోక్కేశారని, పైగా చెరువుల్లో, వాగుల్లో పూడ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారని దీని వల్ల చిన్నపాటి వానకే కాలనీలు నీట మునుగుతున్నాయి. తాజాగా వరదల వల్ల నీట మునిగిన జగనన్న కాలనీలని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. దీంతో జగన్ ప్రభుత్వం కాలనీల్లో చేసిన అక్రమాలు బయటపడతాయని అంటున్నారు. ఇక పవన్ పోరాటం వల్ల జగన్‌కు ఇబ్బందో కాదో గాని..బాబుకు మాత్రం ఇబ్బంది అని చెప్పవచ్చు. పవన్ దెబ్బతో బాబు వెనుకబడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బాబుకే ఇంకా నష్టం.

సీఎం కాన్వాయ్న అడ్డుకున్న సీనియర్ సిటిజన్

కార్ పార్కింగ్కు తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో ఓ పెద్దాయన కర్ణాటక CM సిద్దరామయ్య కాన్వాయ్నే అడ్డుకున్నారు. బెంగళూరులో సీఎం ఇంటి ఎదురుగా ఉంటున్న నరోత్తమ్ అనే వృద్ధుడు ఇవాళ సీఎం ఇంటి నుంచి వస్తున్న కాన్వాయ్ను అడ్డుకున్నారు. ‘మిమ్మల్ని కలిసేందుకు వస్తున్న వారు.. వాహనాలు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేయడంతో మా కార్లు బయటకు తీయలేకపోతున్నామని’ CMకు విన్నవించాడు. చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ధీరజ్ సింగ్  ఠాకూర్  శుక్రవారంనాడు  ప్రమాణం చేశారు.  ఏపీ రాష్ట్ర గవర్నర్   ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు  నాయుడు , పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.ఈ నెల 5వ తేదీన  సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజియం సిఫారసులను  కేంద్రం  ఆమోదం తెలిపింది. ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా  ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  నియమిస్తూ  కేంద్రం ఆదేశాలు  జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  నియమితులైన  ధీరజ్ సింగ్ ఠాకూర్  గురువారంనాడు రాత్రి అమరావతికి చేరుకున్నారు.   ఇవాళ ఉదయం  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ఆయన ప్రమాణం చేశారు.

పవన్ కళ్యాణ్ పై నటి ఊర్వశి మరో ట్వీట్

ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కాదని తెలుసుకున్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరో ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ కలిసి స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. అయితే ఈ ట్వీట్లో కూడా ఆమె మరో పొరపాటుకు తావిచ్చారు. బ్రో సినిమా నేడు విడుదలకాగా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ‘ట్వీట్ ఒకసారి చదివి పోస్ట్ చేయండి.. బ్రో నేడు విడుదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.