Politics

ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ

వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న అసాధారణ వర్షాలు, పంట నష్టం, సహాయకచర్యలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతోంది. దీంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఎన్నికల వేళ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని అంటున్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వరద నీరు ఇంట్లోకి చేరుకోవడంతో కొంతమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. చెరువులు, వాగుల్లోకి వరద నీరు చేరుకుని ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ధాటికి పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఇక పలుచోట్ల వరద ప్రవాహనికి నీటిలో గల్లంతు అయి ప్రాణాలు కోల్పోతున్నారు.

వరద బాధితులకు ఆర్ధిక సాయం ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితులకు రూ.10 వేల సాయం ప్రకటించాలని కోరుతున్నారు. దీంతో వరద సాయం ప్రకటించడంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వర్షాలపై గత వారం రోజులుగా ఉన్నతాధికారులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. సీఎస్ శాంతికుమారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. సహాయకచర్యలు, వరద బాధితులకు పునరావాసం కల్పించడం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను పంపించాలని ఆదేశించారు.