DailyDose

కాలేజీ వద్ద విద్యార్థిని దారుణ హత్య-TNI నేటి నేర వార్తలు

కాలేజీ వద్ద విద్యార్థిని దారుణ హత్య-TNI నేటి నేర వార్తలు

సహజీవన భాగస్వామి మీద మరుగుతున్న నూనె పోసిన మహిళ

నిద్రిస్తున్న సహజీవనభాగస్వామి మీద ఓ మహిళ సలసల కాగే నూనె పోసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నకిరికల్లులో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. నకిరికల్లుకు చెందిన  జగన్నాధపు నాగమణి, అతుకూరి నాగరాజు కొన్నేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారు. అయితే నాగమణికి పిల్లలు పుట్టే అవకాశం లేదు.దీంతో నాగరాజు సంతానం కోసం మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని  నాగమణి అనుమానించింది. దీంతో తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకోవాలను కుంటున్న నాగరాజును ఎలాగైనా అడ్డుతప్పించుకోవాలనుకుంది. ఈనెల 26వ తేదీన నాగరాజు ఇంట్లో పడుకుని ఉండగా.. ఇంట్లో ఉన్న నూనెను సలసలా మరిగించి నాగరాజు ఒంటిమీద పోసింది.అనుకోని ఈ ఘటనకు నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కేకలు వేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు 108 కి ఫోన్ చేశారు.  వారు వచ్చి వెంటనే నాగరాజును హుటాహుటిన నరసరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాగరాజు వాంగ్మూలాన్ని నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా, భార్యపై అనుమానంతో ఓ భర్త వేడి నీరు ఆమె ముఖం మీద కొట్టాడు. ఈ ఘటన  ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంలో కలకలం రేపింది. సోమవారం ఈ ఘటన వెలుగు చూడగా.. బాధితురాలు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దమయంతి,  తాడంగి ప్రసాద్ దంపతులు. వీరిద్దరూ టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు.

కాలేజీ వద్ద విద్యార్థిని దారుణ హత్య

 దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థినిపై యువకుడు రాడ్డుతో దాడి చేసి చంపేశాడు. నగరంలోని మాలవీయ నగర్ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ కాలేజ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.‘దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్‌లో ఓ కాలేజ్‌ సమీపంలో ఒక యువతి మృతదేహం ఉందని మాకు సమాచారం అందింది.  మృతురాలి తలపై గాయాలు కనిపించాయి. మృతదేహానికి సమీపంలోనే ఒక ఇనుప రాడ్డు లభ్యమైంది. ఆమె తన స్నేహితుడితో పార్క్‌కు వచ్చింది’ అని దక్షిణ దిల్లీ డీసీసీ చందన్‌ చౌధరీ వెల్లడించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే ఆమెపై రాడ్డుతో దాడి చేశాడని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చెసినట్లు చెప్పారు. నిందితుడు తెచ్చిన పెళ్లి ప్రతిపాదనకు ఆమె అంగీకరించకపోవడం వల్లే ఈ హత్య జరిగినట్లు సమాచారం.కాగా, ఈ దాడిపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్‌ స్వాతీ మాలీవాల్‌ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘మాలవీయ నగర్  వంటి విలాసవంతమైన ప్రాంతంలో ఒక యువతిని రాడ్డుతో కొట్టి చంపారు. దిల్లీ ఏమాత్రం సురక్షితమైన ప్రాంతం కాదు. మీడియా కథనాల్లో యువతుల పేర్లు మారుతున్నాయి. నేరాలు మాత్రం ఆగడం లేదు’ అని అన్నారు.

విశాఖలో నకిలీ నేవీ అధికారి అరెస్ట్‌

 ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ (Navy ) అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌ను పోలీసులు ( Police ) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేవీ కమాండర్‌ (Navy Commander ) పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్‌ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో చలపతిరావును అరెస్టు చేసి అతడి వద్ద ఉన్నయూనిఫామ్‌, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చలపతిరావు ఇప్పటి వరకు 15 మంది బాధితుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాదించేందుకు ఇలాంటి దారి ఎంచుకున్నాడని వివరించారు.

వాహనంతో ఢీకొట్టి, కాపాడేందుకు ప్రయత్నం

ఓ బొలెరో వాహనం వేగంగా వెళ్తూ పాదచారిని ఢీకొట్టింది. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఆ బొలెరో డ్రైవర్ అతడిని కాపాడాలని అనుకున్నాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు తన వాహనంలో ఎక్కించుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి బాధితుడు మరణించాడు. దీంతో డెడ్ బాడీని రోడ్డు మీదనే పారేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆమనగల్లులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయన్‌పల్లి తండాలో 39 ఏళ్ల జఠావత్‌ బద్యానాయక్‌ నివసిస్తున్నాడు. ఆయన సమీపంలో ఉన్నసూర్యలక్ష్మి కాటన్‌ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం పనికి వెళ్లేందుకు అదే రోజు తెల్లవారుజామున శ్రీశైలం నేషనల్ హైవేపై నడుస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనకాల నుంచి ఓ బొలేరో వాహనం వేగంగా వచ్చి బద్యానాయక్‌ ను ఢీకొట్టడంతో అతడు కింద పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ బొలేరో డ్రైవర్ బాధితుడిని రక్షించాలని భావించాడు. తన వాహనంలోనే ఎక్కించుకొని కల్వకుర్తి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించాడు. కానీ మార్గమధ్యంలోనే బాధితుడి పరిస్థితి విషమించి చనిపోయాడు. 

1500 మద్యం కోసం భార్యను స్నేహితులకు అప్పజెప్పిన నీచుడు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితులపై పోలీసు స్టేషన్‌లో అత్యాచారం, శారీరక వేధింపుల కేసు పెట్టింది. మద్యం, డబ్బుకు ఆశపడి తన స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె మద్యానికి బానిసైన భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న తన భర్త, స్నేహితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.1500 రూపాయల కోసం అత్యాశతో మద్యం మత్తులో ఉన్న భర్త తన శరీరాన్ని స్నేహితులకు అప్పగించాడని ఆ మహిళ చెబుతోంది. తన భర్త 01.06.2023 రాత్రి మద్యం సేవించి వచ్చాడని, అతని ముగ్గురు స్నేహితులను కూడా తీసుకొచ్చాడని నఖాసా స్టేషన్ ఇన్‌చార్జికి ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. అతని స్నేహితుడు అతన్ని దుర్భాషలాడాడు. స్నేహితులు భర్తకు 1500 రూపాయలు ఇచ్చి ముగ్గురూ లోపలి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అందరూ ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. ఇది కేవలం ఒక్కరోజులో జరిగిన సంఘటన కాదని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగిందని ఆ మహిళ చెప్పింది. ముగ్గురూ ఆమె జీవితాన్ని నాశనం చేశారని.. నిరసన తెలిపిన ప్రతిసారీ బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గత రెండు వారాలుగా వారంతా ఈ దారుణానికి ఒడిగడుతున్నారు.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నావికుడి ఆత్మహత్య

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో 19 ఏళ్ల నావికుడు ఒకరు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. గురువారం తెల్లవారుజామున అతడు సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కన్పించినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుడు బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

*  విద్యార్థులతో క్లాస్‌రూమ్‌లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్‌ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ చదువుకునే ఉంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలతో సమానం. మనకు జ్ఞానాన్ని బోధించే ప్రత్యక్ష దైవం అని అర్థం. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో ఉపాధ్యాయుడు చేరిపోయాడు.విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చి దిద్దాల్సిన గురువు.. వారి చేతులతో మసాజ్ చేయించుకున్నాడు.ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో మసాజ్ చేయమని విద్యార్థులను బలవంతం చేశాడనే ఆరోపణలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. సేంద్రిముండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అతడిని గురువారం సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సంజయ్ గుప్తా తెలిపారు. మసాజ్ చేయమని పిల్లలను అడిగారని, వారు నిరాకరించినట్లయితే కొట్టారని కొంతమంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నివేదిక అందించడంతో సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. సంబంధిత క్లస్టర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్‌కు కూడా నోటీసు అందించామని, తదుపరి విచారణ జరుగుతోందని డీఈవో సంజయ్ గుప్తా తెలిపారు.

రామంతాపూర్‌లో నకిలీ జడ్జి అరెస్టు

ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలు, భూ కబ్జాలు, అధికారుల ముసుగులో డబ్బులు వసూలు చేయడాలు వంటి అనేక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో నివసిస్తున్నాడు. గతకొంత కాలంగా సివిల్ జడ్జి అవతారమెత్తి, ఓ ప్రయివేట్ గన్‌మెన్‌ను పెట్టుకొని నేరాలకు పాల్పడటం వంటివి చేశాడు.విజిటింగ్ కార్డులు, గన్ మెన్లను పెట్టుకుని సెటిల్మెంట్‌లు చేశాడు. కోర్టు కేసులను పరిష్కరిస్తానని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. అదేవిధంగా ధరణిలో మ్యుటేషన్, ఇతర రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తానని చాలామందిని మోసగించినట్లు తెలిసింది. అతని వద్ద రూ.20 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నకిలీ జడ్జి బండారం బయటపడింది. చివరకు నరేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై గతంలోనే అనేక కేసులు ఉన్నట్లు గుర్తించారు.

విషాదం మిగిల్చిన వరద

 జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా,  ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు సమాచారం.దీంతో గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వ్యక్తులు వరదల కారణంగా మృతి చెందారు. వర్షం కొంత తెరిపివ్వడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

* వాటికి అలవాటు పడి చోరీలు

జల్సాలకు మరిగి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని సౌత్-ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారు. వీరి నుంచి 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హుస్సేనీ ఆలం నివాసి షేక్ ముస్తఫా (21), ఓల్డ్ సంతోష్ నగర్ వాస్తవ్యుడు మొహమ్మద్ అఫ్సర్ (28) స్నేహితులు. వీరికి మైనారిటీ తీరని మరో ఇద్దరితో కూడా స్నేహం ఉంది. కాగా, జల్సాలకు అలవాటు పడ్డ ఈ నలుగురు వాటిని తీర్చుకోవటానికి కావాల్సిన డబ్బు కోసం నేరాల బాట పట్టారు. హుస్సేనీ ఆలం, ఖైరతాబాద్, ఐఎస్ సదన్, బండ్లగూడ, కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నుంచి 7 బైక్‌లను తస్కరించారు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసారు.