Politics

హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం

హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం భిన్నంగా ఉందని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని చెప్పారు. తాను చెప్పింది ఒక్కటైతే.. సీబీఐ దాన్ని మార్చి చార్జ్‌షీట్‌లో మరో విధంగా పేర్కొందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో వివక్ష, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని కోరారు.

2019 మార్చి 15న హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని చెప్పారు. సమావేశం ప్రారంభమైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారని తెలిపారు. ఓఎస్‌డీ కృష్ణమోహన్ వచ్చి జగన్‌కు ఏదో విషయం చెప్పారని.. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న(వైఎస్ వివేకానందరెడ్డి) చనిపోయారని చెప్పారని తెలిపారు. ఇంతకుమించి తాను సీబీఐకి చెప్పలేదని అన్నారు. కానీ సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చివేసిందని ఆరోపించారు. సీఎం జగన్ భార్య ప్రస్తావన కానీ.. మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని రిట్ పిటిషన్‌లో అజయ్ కల్లం పేర్కొన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి కనిపిస్తోందని అన్నారు. కొంతమందిని ఇరికించేందుకు సీబీఐ ఇలా చేస్తుందని ఆరోపించారు. ఇక, తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్రం, సీబీఐలను పేర్కొన్నారు.

ఇక, వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని నెలల క్రితం అజయ్ కల్లాం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, వివేకా హత్య కేసుకు ముడిపెడుతూ కథనాలను ప్రచురించడం సరికాదని అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలం మీడియాలో రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దర్యాప్తు అంశాలు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. దర్యాప్తు అంశాలు లీక్ కావడం సరికాదన్నారు.సీబీఐ అధికారికి చెప్పిన విషయాలు ఎలా లీక్ అవుతున్నాయో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదని ఆయన అబిప్రాయపడ్డారు. సీబీఐకి తాను చెప్పిన అంశాలను మీడియాలో వక్రీకరించి రాశారన్నారు. సీబీఐ అధికారులు అడగని దాన్ని కూడా మీడియాలో రాయడం సరికాదన్నారు. తాను సీబీఐకి ఇచ్చిన సమాచారం రహస్యంగా ఉంచాలన్నారు.