Politics

జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ నియామకం

జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ నియామకం

మొత్తానికి బండి సంజయ్‌కు జాతీయ స్థాయి పదవి దక్కింది. ఇటీవల తెలంగాణ బి‌జే‌పి అధ్యక్ష పదవి నుంచి తొలగించిన ఆయనకు బి‌జే‌పి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అలాగే డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్టు జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఇక ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌‌కు సైతం మరోసారి జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.అయితే ఇక్కడ చర్చ మొత్తం బండి గురించే..ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. తర్వాత అధ్యక్ష పదవి దక్కింది. అక్కడ నుంచి వెనక్కి తగ్గలేదు. కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లారు. బి‌జే‌పిని బలోపేతం చేశారు. ఉపఎన్నికల్లో గెలుపుకు కృషి చేశారు. అసలు బి‌ఆర్‌ఎస్ వర్సెస్ బి‌జే‌పి అన్నట్లు ఫైట్ మార్చారు. అలా చేసిన బండి..అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదని కొందరు నేతలు..అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ని పక్కన పెట్టి సాఫ్ట్ గా ఉండే కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు.

దీంతో బండి వర్గం అసంతృప్తిగా ఉంది..పనిచేసే నేతని పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నలు వచ్చాయి. అయితే బండికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం వచ్చింది. ఎలాగో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని, దీంతో బండికి పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ పదవి చాలా పెద్దదే.కానీ బండి వర్గం అలా చూసే అవకాశం లేదు..అధ్యక్షుడు లేదా కేంద్ర మంత్రి అనేది మెయిన్ అని భావిస్తారు. అయితే ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి బండి ఇకనైనా దూకుడుగా పనిచేస్తారా? లేదా సైలెంట్ గా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే గళం విప్పుతారా? అనేది చూడాలి.