NRI-NRT

లోకేశ్​కు మద్దతుగా ఖతార్​లో అభిమానుల సభ

లోకేశ్​కు మద్దతుగా ఖతార్​లో అభిమానుల సభ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నారై తెదేపా ఖతార్ కార్యవర్గ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో భారీ మద్దతు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ డా.కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెదేపా ఆవిర్భావం, పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించిన తర్వాత బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ ఏవిధంగా చేదోడు వాదోడుగా నిలిచిందో, వారికి రాజ్యాధికారాన్ని ఎలా కల్పించిందో, సామాజిక న్యాయం కోసం ఏ విధంగా కృషి చేసిందో వివరించారు. సభాప్రాంగణ అలంకరణ ఎంతగానో ఆకట్టుకొందని, పార్టీ తోరణాలు, జెండాలతోపాటు, అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌, ఎన్టీఆర్‌ల ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో సభా ప్రాంగణం పసుపు మయంగా మారిందని అన్నారు. కుప్పం నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు. భారతంలో అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు తనకు లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యమే కనిపిస్తోందని అన్నారు.

తన సుదీర్ఘ ప్రసంగంలో కుప్పంలో నాటి పరిస్థితులు, చంద్రబాబు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విధానం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి శ్రీకాంత్‌ వివరించారు. రాబోయే ఎన్నికలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతిఒక్కరూ ఆయా నియోజకవర్గాల నాయకులతో సమన్వయం చేసుకొని పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన ఖతార్ తెదేపా శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, జనరల్ సెక్రటరీ పొనుగుమాటి రవి, జీసీసీ కౌన్సిల్ మెంబర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, కోశాధికారి విక్రమ్ సుఖవాసి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజర్ దాసరి రమేష్, కమిటీ సభ్యులు, సింగరాజు సంతోష్, మాగులూరి రవీంద్ర, యరమంచిలి శాంతయ్య, బొడ్డు రామారావులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ఖతార్‌ తెదేపా శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. ఖతార్ తెదేపా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్న క్యాంటీన్లకు పెద్దఎత్తున సహకరించిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. పార్టీని గెలిపించేందుకు ప్రతి ప్రవాసుడు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈసారి తెదేపా అధికారంలోకి రాకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ ఉనికే ప్రమాదంలో పడుతుందని చెప్పారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెదేపా విజయానికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ప్రవాసీ వారి ఓట్లను ఆన్‌లైన్‌లో తరచూ చెక్‌ చేసుకోవాలని కోరారు. వారి గ్రామాల్లో కనీసం 10 కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేదోడువాదోడుగా ఉండాలని సూచించారు. జనరల్ సెక్రటరీ పొనుగుమాటి రవి ప్రసంగిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, అవినీతి పాలన, ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్న తీరుతెన్నులు పూర్తిగా విఫలమైన శాంతిభద్రతలు, అమరావతి ధ్వంసరచన గురించి వివరించారు. సమస్యల పట్ల యువగళంలో నారాలోకేశ్‌ వ్యవహరిస్తున్న తీరు, యువతతో మమేకమై వారిని ప్రోత్సహిస్తున్న విధానం అభినందనీయమని కొనియాడారు. యువగళం పాదయత్రని అడ్డుకోవాలని చూస్తే.. అది వైకాపా ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని హెచ్చరించారు.

జీసీసీ కౌన్సిల్ మెంబర్ మల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, యువగళానికి వస్తున్న ప్రజామద్దతు చూస్తుంటే తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని అర్థమవుతోందన్నారు. వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడేసమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ప్రోగ్రాం ఆర్గనైజర్ దాసరి రమేష్, కమిటీ సభ్యులు యరమంచిలి శాంతయ్య, సింగరాజు సంతోష్, మాగులూరి రవీంద్ర, సరిత, నూతలపాటి నరేష్, దందా విజయ భాస్కర్, దినేష్, సాయి గిరీష్ మాట్లాడుతూ ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న పన్నుల భారం, విదేశి విద్యను అటకెక్కించిన తీరు, అధ్వానంగా తయారైన రహదారులు, అవినీతి, కబ్జాలు, మైనింగ్ అండ్ లిక్కర్ మాఫియాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా 3 తీర్మానాలను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించారు. తెదేపా అభిమానులు తమకు నచ్చిన మార్గంలో పార్టీకి ఆర్థికంగా సాయం చేయాలని తీర్మానించారు. ప్రతి పసుపు సైనికుడు వారి బంధువులను, స్నేహితులను ప్రభావితం చేయాలని, పార్టీని గెలిపించేందుకు కృషి చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ఖతార్‌లో పని చేస్తున్న ప్రవాస బ్లూ కాలర్‌ వర్కర్స్‌ని గుర్తించి ఎన్నికల సమయంలో వారికి టికెట్‌ బుక్‌ చేసి సొంత ఊళ్లకు పంపాలని నిర్ణయించారు. అనంతరం 2000కి.మీ పాదయాత్ర నేపథ్యంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి పొనుగుమాటి రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విక్రమ్ సుఖవాసి ధన్యవాద ఉపన్యాసాలతో, డిన్నర్ కార్యక్రమంతో సభను ముగించారు.