దేశంలో భాషలన్నింటికి నూతన జాతీయ విద్యావిధానం గౌరవం, ప్రాముఖ్యతను కల్పించనుందని, విద్యార్థులకూ సామాజిక న్యాయం అందించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భాషలతో రాజకీయాలు చేసే స్వార్థపరులు.. ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సిందేనని అన్నారు. జాతీయ విద్యా విధానం ప్రారంభించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా శనివారం ప్రగతి మైదాన్‌లో ‘అఖిల భారతీయ శిక్షా సమాగం’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాతృభాషలో బోధనే.. దేశంలోని యువ ప్రతిభకు న్యాయం చేస్తుందని ఉద్ఘాటించారు. సామాజిక న్యాయపరంగానూ జాతీయ విద్యా విధానం ఓ కీలక ముందడుగుగా పేర్కొన్నారు. భాషపై పట్టుంటేనే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. అందుకే దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు. ‘‘సామర్థ్యాన్ని విస్మరించి.. భాషతోనే విద్యార్థి ప్రతిభను అంచనా వేస్తున్నాం. దేశంలోని యువతకు మనం చేస్తున్న ఘోర అన్యాయమిది. అందుకే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. మాతృభాషలో బోధనతోనే యువ ప్రతిభకు వాస్తవ న్యాయం జరగనుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయి. ఐరోపానే తీసుకుంటే అక్కడ చాలా దేశాలు.. స్థానిక భాషలనే వినియోగిస్తాయి. మనం మాత్రం ఎన్నో భాషలు అందుబాటులో ఉన్నా.. వాటిని వెనకబాటుతనానికి చిహ్నంగానే చూశాం. ఇంత కంటే దౌర్భాగ్యం ఏముంటుంది..! ఇంగ్లిషు రాకపోతే ఎంత ప్రతిభావంతుడినైనా తొందరగా స్వీకరించం.. గ్రామీణ భారతంలోని ఎంతో మంది మెరికల్లాంటి విద్యార్థులు ఈ ధోరణితో నష్టపోయారు. జాతీయ విద్యా విధానంతో ఈ హీన భావనను తొలగించే ప్రయత్నం ఆరంభమైంది. ఐక్యరాజ్యసమితిలో నేను భారత భాషలోనే మాట్లాడతాను. దీనివల్ల వినేవాళ్లకు చప్పట్లు కొట్టడానికి కొంత సమయం పడుతుందేమో.. పట్టనీయండి. సాంఘిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక భారతీయ భాషల్లోనే జరగనుంది. మాతృభాషతో ఇంకో లాభమేంటంటే భాషా రాజకీయాలతో విద్వేష దుకాణాలను తెరిచిన వారు ఇక వాటిని మూసుకోవాల్సి ఉంటుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.