DailyDose

భారత్‎లోకి ప్రవేశించిన పాక్ విమానం-TNI నేటి తాజా వార్తలు

భారత్‎లోకి ప్రవేశించిన పాక్ విమానం-TNI నేటి తాజా వార్తలు

* హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచి కొట్టాయి. దీంతో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ వరదల కారణంగా కృష్ణా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారి మీదికి నీరు భారీగా చేరింది. వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీద దాదాపు 24 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.వేలాది వాహనాలకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. టీఎస్ఆర్టీసీ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్-విజయవాడల మధ్య రెగ్యులర్ గా నడుపుతున్న సర్వీసులను రద్దు చేసింది. 24 గంటల తర్వాత ఈ దారిని పునరుద్ధరించారు. తిరిగి వాహనాల రాకపోకలు తాజాగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ హైవే మీద యధావిధిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్నేరు వాగు శాంతించడంతో.. వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. వాహనాలు నిలిచిపోయిన సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సహాయక చర్యలో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాల సహాయంతో రక్షించారు.

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఐఎండీ వార్నింగ్

నార్త్‌ ఇండియాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు సౌత్‌ ఇండియాపై విరుచుకుపడుతున్నాయి..తెలుగు రాష్ట్రాల్లో  ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.. అటు వరంగల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సలహా పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో బుధవారం (జులై 26) సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) వర్షం విడవకుండా కురుస్తూనే ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. మరో మూడు రోజులు  ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో  అతి భారీ వర్షాలు కురుస్తాయని  ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది.వాతావరణ శాఖ (వార్తరాసే సమయానికి)  ఇచ్చిన అప్‌డేటెడ్‌ ప్రకారం అల్లూరి సీతారామరాజు, తీరప్రాంత పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇదే సమయంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు పడతాయని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, అల్లూరి, ఏలూరు, ఎగువ పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది వాతావరణశాఖ. దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్రను అనుకుని స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. నెమ్మదిగా కదులుతూ ఇవాళ రోజంతా భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గాలులు తీవ్రంగా వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది వాతావరణశాఖ

* భారత్‎లోకి ప్రవేశించిన పాక్ విమానం

భారత సరిహద్దుల్లోకి పాక్ విమానం ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. ఈ విమానం 1 గంటకు పైగా భారత గగనతలంపై ఎగురుతూనే ఉంది. రాజస్థాన్‌తో సహా 3 రాష్ట్రాల్లోని భారత గగనతలంలో పాకిస్థాన్ విమానం ఎగురుతూనే ఉంది. ఈ రాష్ట్రాలు ఏవీ కూడా దాని గురించి తెలుసుకోలేదు. సాయంత్రం 4.31 గంటలకు పాకిస్తాన్ ప్యాసింజర్ విమానం PIA-308 కరాచీ నుండి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విమానం ట్రాక్‌ నుంచి తప్పుకుంది. ఆపై సాయంత్రం 5.20 గంటలకు భారత సరిహద్దులోకి ప్రవేశించింది.ఏ రాష్ట్రాల మీదుగా ప్రయాణించింది?పాకిస్థాన్‌ నుంచి బయలుదేరిన విమానం పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ సరిహద్దులోకి ప్రవేశించింది. ఇక్కడ నుండి హర్యానా, పంజాబ్ మీదుగా ప్రయాణిస్తున్న విమానం సుమారు 1 గంట 12 నిమిషాల పాటు భారత గగనతలంలో తిరుగుతూనే ఉంది. అయితే పంజాబ్‌లోకి ప్రవేశించిన పాక్ విమానం సాయంత్రం 6.14 గంటలకు తిరిగి పాక్ గగనతలానికి చేరుకుంది.

*  అమెరికాలో కోలుకుంటున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య

ఈ నెల ప్రారంభంలో అమెరికాలో పిడుగుపాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్న 25 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కోలుకుంటోంది. ఇంత కాలం వెంటిలేటర్ పై ఉన్న ఆమె.. వారం రోజుల నుంచి సొంతంగా శ్వాస తీసుకుంటోందని డాక్టర్లు తెలిపారు. హ్యూస్టన్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు జూలై 2వ తేదీన శాన్ జెసింటో స్మారక పార్కు వద్ద స్నేహితులతో కలిసి చెరువు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగు పడింది.దీంతో వెంటనే ఆమె చెరువులో పడిపోయింది. తరువాత సుశ్రూణ్య గుండె లయ తప్పింది. తరువాత ఆమెను స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు ఆమె కోమాలోకి వెళ్లిందని నిర్ధారించారు. దీంతో పాటు శ్వాస తీసుకోలేకపోవడం, మెదడు పనితీరు తిరిగి కూడా సరిగా లేకపోవడంతో పీఈజీ ట్యూబ్ సహాయంతో ట్రాకియోస్టోమీతో వెంటిలేటర్ పై ఉంచారు. ఆమె పిడుగుపాటుకు గురైందని హ్యూస్టన్ విశ్వవిద్యాలయం జూలై 26 న ట్వీట్ చేసింది.సుశ్రూణ్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ‘గోఫండ్‌మీ’ని ఆశ్రయించారు. ఆన్ లైన్ ద్వారా ఆమె ట్రీట్ మెంట్ కు అవసరమైన డబ్బులను దాతల నుంచి కోరారు. తమ బిడ్డ కోలుకోవడానికి అందరి సహాయం కావాలని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. 

బీసీలకు ఏం మేలు చేశారో చెప్పాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు?

 తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ తమ అయిదేళ్ల పాలనలో బీసీలకు ఏం మేలు చేశారో చెప్పాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు డిమాండ్‌ చేశారు. వైకాపా ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, బి.వి.సత్యవతి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, బీద మస్తానరావులతో కలిసి ఏపీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీసీల భవిష్యత్తు, అభ్యున్నతికి అమలు చేసిన పథకాల గురించి చెప్పే ధైర్యం తెదేపా నేతలకు లేదన్నారు. బీసీ సామాజికవర్గాలను తన వాళ్లంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్కున చేర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉనికి కోసం తెదేపా, దానికి మద్దతు తెలిపే పార్టీలు పాట్లు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. అమర్‌నాథ్‌ హత్యపై ఒంగోలు సభలో లోకేశ్‌ ప్రస్తావించడం సరికాదన్నారు. ఆ హత్యకు రాజకీయ కారణాలేవీ లేవన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు.

*  రెడ్డి-బీసీ… టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి?

ఏపీలో అత్యంత కీలక పదవుల్లో టీటీడీ ఛైర్మన్ పదవి ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి అంటే మంత్రి హోదా కంటే పెద్దదని భావిస్తారు. అలాంటి పదవి కోసం నేతలు ఎప్పుడు పోటీ పడుతుంటారు. అయితే టి‌డి‌పి అధికారంలో ఉన్నప్పుడు ఈ పదవి బి‌సి నేతలకు ఇస్తూ వచ్చింది..గతంలో కాగిత వెంకట్రావు, పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వారికి ఇచ్చింది.ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండగా వైఎస్సార్ టైమ్ లో భూమన కరుణాకర్ రెడ్డి టి‌టి‌డి ఛైర్మన్ గా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అనూహ్యంగా ఈ పదవిని తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఆయన ఎంపీ సీటు త్యాగం చేశారు. దీంతో ఆయనకు టి‌టి‌డి ఛైర్మన్ పదవి ఇచ్చారు. పదవీకాలం ముగిసిన దాన్ని మళ్ళీ పొడిగించారు. టి‌టి‌డి చరిత్రలో ఇంతకాలం పదవి చేపట్టిన నేత సుబ్బారెడ్డి మాత్రమే.అయితే సుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక అనేక విమర్శలు కూడా వచ్చాయి. తిరుమలలో దర్శనం దగ్గర నుంచి లడ్లు, పార్కింగ్ ఫీజులు భారీగా పెంచేశారు. అటు తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. ఆ మధ్య ఓ ట్రస్ట్ గురించి ఆరోపణలు వచ్చాయి. వాటి అన్నిటికి వైసీపీ చెక్ పెడుతూనే వచ్చింది.

 నీట మునిగిన.. సమ్మక్క సారలమ్మ గద్దెలు

మేడారంలో ఎటు చూసినా నీళ్లే. ఎటు చూసినా వరదలే. మేడారం జలదిగ్భంధమైంది. భారీ వర్షాలకు, వరదలకు మేడారం నీటమునిగింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలు నీటమునిగాయి. అమ్మవార్ల ఆలయాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. సమ్మక్క సారలమ్మ ఆలయాలు జలమయమవ్వగా..ఆలయాల బయట దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. దుకాణాలు కూలిపోయాయి. అందులో ఉండే పూజా సామాగ్రి కొట్టుకుపోయాయి.  గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న మేడారం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కిషన్‌పై బాలకృష్ణ ఫైర్

తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై..బి‌జే‌పి సస్పెండెడ్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, బి‌జే‌పి అధిష్టానంపై విమర్శలు చేశారని చెప్పి జిట్టాని బి‌జే‌పి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో కొందరు నేతలు ఈ మధ్య అధిష్టానంపై విమర్శలు చేశారని, కానీ వారిని వదిలేసి జిట్టానే ఎందుకు సస్పెండ్ చేశారని మీడియా ప్రశ్న వేస్తే..అది తమ పార్టీ అంతర్గత విషయమని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో జిట్టా మీడియా ముందుకొచ్చి కిషన్ రెడ్డి టార్గెట్ గా విరుచుకుపడ్డారు. కే‌సి‌ఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనని సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. అసలు ప్రతి అంశాన్ని మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ బీజేపీని బలహీనపరిచారని, అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.

రాయలసీమ ప్రాజెక్టులను సీఎం జగన్‌ నాశనం చేశారు

పోలవరానికి సీఎం జగనే శని అని.. రాయలసీమ ప్రాజెక్టులను ఆయన నాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. తెదేపా ప్రభుత్వం పూర్తి చేసిన సంఘం, నెల్లూరు బ్యారేజీలకు తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప వైకాపా ఉద్ధరించింది ఏమైనా ఉందా? అని మండిపడ్డారు. తెదేపా ఐదేళ్ల పాలనలో సాగునీటి విషయంలో ఏం చేశామన్న చరిత్ర తమ దగ్గర ఉందన్నారు. 

ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు:రోజా

 మంత్రి ఆర్కే రోజా మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.. రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్న ఆమె.. కానీ, పార్టీ పెట్టింది ఎందుకో పవన్ కల్యాణ్ కే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.. పవన్ కల్యాణ్‌.. ఇతర పార్టీలకు ఓట్లు వేయడానికే పార్టీ పెట్టాడు ఎమో అంటూ పంచ్‌లు వేశారు. ఇక, చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు నిధులు అనుసంధానం మాత్రమే చేస్తాడు.. అధికారం లేకపోతే నదులు గురించి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే అని దుయ్యబట్టారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నదులు అనుసంధానం ఎందుకు చేయాలేదు? అని నిలదీశారు మంత్రి ఆర్కే రోజా.కాగా, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల మహిళలు, యువతులు అదృశ్యమయ్యారంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలకు మంత్రి రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన విషయం విదితమే.. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందుగా పవన్‌ కల్యాణ్‌ వల్ల ఎంత మంది మహిళలు అదృశ్యమయ్యారో లెక్క తేలాల్సిన అవసరముందని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంసథ నివేదిక ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్‌ చేసిన ఆమె.. పవన్‌ మాటాలు గురవింద గింజ సామెతలా ఉన్నాయని మండిపడిన విషయం విదితమే.