డిజి లాకర్‌లో ధ్రువపత్రాలున్నాయా…? అయితే పాస్‌పోర్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ సులభమైనట్టే.. అపాయింట్‌మెంట్ ఉన్న రోజున వెళ్లి ఓ ఫొటో దిగొస్తే చాలు. తదుపరి ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజుల్లో పాస్‌పోర్టు మీ చేతికొస్తుంది. భౌతికంగా ధ్రువపత్రాలు అందించడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్ పెడుతూ విదేశాంగశాఖ డిజి లాకర్ ద్వారా పత్రాల అప్‌లోడింగ్‌కు అనుమతించింది. దీంతోపాటు ఈ-ఆధార్‌కూ అనుమతి లభించిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 3,800కుపైగా అపాయింట్‌మెంట్లు మంజూరవుతున్నాయి. వీటిలో 10శాతం దరఖాస్తుల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించలేదని, ధ్రువపత్రాల్లో పొరపాట్లున్నాయని తిరస్కరించడం, ఆధార్‌కార్డు తీసుకురాలేదని తిప్పి పంపుతున్న సందర్భాలున్నాయి. ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకురాలేని వారికి మళ్లీ అపాయింట్‌మెంట్ దొరికి ప్రక్రియ పూర్తయ్యే సరికి మరో రెండు నెలల సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని తొలగించేందుకు విదేశాంగశాఖ డిజిలాకర్ ద్వారా అప్‌లోడ్ చేసే ధ్రువపత్రాలను అనుమతిస్తోంది.
ఏంటీ ఈ డిజి లాకర్…డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెట్టిన డిజిలాకర్ ఆన్‌లైన్‌లో వినియోగదారులు తమ పత్రాలను భద్రపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. 12 సంఖ్యల ఆధార్ నంబర్ ద్వారా ఖాతా తెరవవచ్చు. డిజిలాకర్ ఉంటే డాక్యుమెంట్లు కాగిత రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పాస్‌పోర్టు దరఖాస్తుకు డిజిలాకర్ నుంచి ఆధార్‌ను అప్‌లోడ్ చేసే విధానం కోసం ఈ వీడియో చూడండి