ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులలో జోష్ తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించి, వచ్చే ఎన్నికలలో బలంగా వైసీపీతో తలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. వరుసగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన దృష్టి సారించిన ఆమె గుంటూరు, రాజమండ్రిలో నిర్వహించిన జోనల్ సమావేశాలలో పాల్గొని, పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అధికార వైసిపి పాలన వైఫల్యాలను ఎండగడుతున్న పురందేశ్వరి ఏపీలో బీజేపీకి జవసత్వాలు తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఉత్తరాంధ్రలోనూ జోనల్ స్థాయి సమావేశానికి హాజరైన పురందేశ్వరి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కేంద్రంలోని అధికార బీజేపీ ఏం చేస్తుందో చెబుతూనే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేశారు. దీంతో పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! అంటూ విజయసాయిరెడ్డి పురందేశ్వరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇక ఈ నిర్ణయం చేస్తేనే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? ఎందుకు అంటూ పురందేశ్వరిని టార్గెట్ చేశారు.బీజేపీ లో ఉన్నా, లోపాయికారిగా ఇతర పార్టీలకు పనిచేస్తుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను, వైజాగ్ రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ సమస్యలను గుర్తుచేసి బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. విద్యావంతురాలైన, ఏదైనా విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పే నైపుణ్యం ఉన్న పురందేశ్వరి ఇటీవల కాలంలో వైసీపీపై మాటల దాడి పెంచటంతో విజయసాయి రెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.