ScienceAndTech

అమెరికా డిఫెన్స్ పరికరాల్లో చైనా వైరస్

అమెరికా డిఫెన్స్ పరికరాల్లో చైనా వైరస్

“అందుగలదు.. ఇందులేదన్న సందేహం వలదు..” అన్నట్టుగా చైనా హ్యాకర్లు ప్రతీచోటకు చొరబడుతున్నారు. అమెరికాకు చెందిన రక్షణశాఖ పరికరాల్లోకి, ఆర్మీకి చెందిన నెట్‌వర్క్‌ కంట్రోలింగ్‌ పవర్‌ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నీటి సరఫరా వ్యవస్థల్లోకి చైనా మాల్‌వేర్‌ చొరబడిందని సీనియర్‌ సైనికాధికారులు చెప్పారంటూ “న్యూయార్క్‌ టైమ్స్‌” సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ మాల్ వేర్ ద్వారా యుద్ధ సమయాల్లో అమెరికా సైన్యం యాక్టివిటీస్ కు అంతరాయం కల్పించే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారని తెలిపింది.చైనా హ్యాకర్లు ఒక చిన్న కంప్యూటర్‌ కోడ్‌ను అమెరికా రక్షణశాఖ పరికరాల్లోకి చొప్పించారనే అనుమానాలు ఉన్నాయని.. సైన్యానికి చెందిన నెట్‌వర్క్‌ కంట్రోలింగ్‌ విద్యుత్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, సైనిక స్థావరాల నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారని కథనంలో విశ్లేషించింది.

ఆ కోడ్‌ను ఉపయోగించి కీలక సమయాల్లో మిలటరీ బేస్‌లకు విద్యుత్తు, నీరు, కమ్యూనికేషన్లను హ్యాకర్లు కట్‌ చేసే అవకాశం ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌ కు చెందిన అధికారి ఒకరు తమకు ధ్రువీకరించారని “న్యూయార్క్‌ టైమ్స్‌” వెల్లడించింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ ఉన్న గువాంలో తొలిసారి అనుమానాస్పద కోడింగ్‌ను మైక్రోసాఫ్ట్‌ గుర్తించింది. ఆ తర్వాత అమెరికాలోని మరో కీలక ప్రదేశంలోని కంప్యూటర్లలో కూడా ఆ కోడింగ్ ఉన్నట్లు తేలింది.దీనివెనుక “వోల్ట్‌ టైఫూన్‌” అనే చైనా హ్యాకింగ్‌ గ్రూప్‌ ఉందనే అనుమానాలు ఉన్నాయి. గత వారం చైనాలోని అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌ ఈమెయిల్‌ అకౌంట్ హ్యాక్‌ అయింది. ఈ నెల మొదట్లో చైనా హ్యాకర్లు దాదాపు 25 సంస్థల మెయిల్స్‌ను హ్యాక్‌ చేసినట్లు మైక్రోసాఫ్ట్‌, వైట్ హౌస్ వెల్లడించాయి. కొన్ని నెలల క్రితం ఈ మాల్వేర్‌పైనే అమెరికా సైనికాధికారులు సిచ్యూవేషన్‌ రూమ్‌లో సమావేశమయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.