Business

రేపటితో ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ముగియనున్న గడువు

రేపటితో ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ముగియనున్న గడువు

ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు(ITRs) దాఖలు చేసేందుకు గడువు ఇంకా ఒక్కరోజే ఉండటంతో రిటర్నులు సమర్పించేందుకు పన్నుచెల్లింపుదారులు ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఐటీశాఖ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్‌ కాగా.. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో లాగిన్‌ అయ్యారు. ఈ ఒక్కరోజే సాయంత్రం 6.30గంటల వరకు 1.30 కోట్ల మందికి పైగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్‌ కాగా.. వారిలో 26.76లక్షల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఐటీశాఖ వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటిదాకా మొత్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 6 కోట్ల మైలురాయి దాటిందని వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ ఫైలింగ్‌, పన్ను చెల్లింపులు, ఇతర సర్వీసుల కోసం తమ హెల్ప్‌ డెస్క్‌ 24*7 అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అలాగే, ఫోన్‌కాల్స్‌, లైవ్‌చాట్స్‌, వెబ్‌ఎక్స్‌ సెషన్లు, సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించవచ్చని ఐటీ శాఖ సూచించింది.ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గత మదింపు సంవత్సరంలో 7.4 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 6కోట్ల మందికి పైగా రిటర్నులు ఫైల్‌ చేశారు. మరోవైపు, గత వారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా మాట్లాడుతూ.. గడువు పెంచాలనే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని, అందువల్ల పన్ను చెల్లింపుదారులందరూ వెంటనే రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో గడువును పెంచుతారా? లేదా? అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది.