NRI-NRT

గుంటూరు యువకుడికి నాసాలో కొలువు

గుంటూరు యువకుడికి నాసాలో కొలువు

గుంటూరుకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా)లో కొలువు సాధించాడు. కడప జిల్లాకు చెందిన నర్రావుల ఈశ్వరరెడ్డి, శివపార్వతిలు 10 సంవత్సరాల కిందట గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. హర్షవర్దన్‌రెడ్డి చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. పదో తరగతి పులివెందులలో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో చదివాడు. ఇంటర్‌ పూర్తిచేశాక పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ గౌహతిలో సీటు సాధించాడు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి సిల్వర్‌ మెడల్‌ పొందాడు. హర్షవర్దన్‌రెడ్డి ప్రతిభను గుర్తించిన ఓఎన్‌జీసీ సంస్థ రూ.లక్ష ఉపకార వేతనం, బంగారుపతకం అందించింది. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌ కోసం కెనడా వెళ్లాడు. 2015లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు. అందుకు కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో పీహెచ్‌డీ చేసేందుకు సొంతంగా సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2015 నుంచి 2016 వరకు రిలయన్స్‌ సంస్థలో చేసిన హర్ష, 2016-17 మధ్య ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధకుడిగా సేవలందించారు. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంతో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేయగా సీటు వచ్చింది. ఏరో స్పేస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే నాసాలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కోర్సు పూర్తి చేసి ఈనెల 10న కాలిఫోర్నియాలోని నాసా ఫీల్డ్‌ సెంటర్‌లో ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

More Info: http://www.pellegrino.caltech.edu/harsha-reddy-bio