Business

గంటలో 3లక్షల రిటర్నులు-TNI వాణిజ్య వార్తలు

గంటలో 3లక్షల రిటర్నులు-TNI వాణిజ్య వార్తలు

* ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఇంకా ఒక్కరోజే ఉండటంతో రిటర్నులు సమర్పించేందుకు ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్‌ కాగా.. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 46లక్షల మందికి పైగా లాగిన్‌ అయినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. వీరిలో ఈ మధ్యాహ్నం 1గంట వరకు 10.39లక్షల మంది ఐటీఆర్‌లను ఫైల్‌ చేయగా.. చివరి గంట వ్యవధిలోనే 3.04లక్షల మంది దాఖలు చేసినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు (30వ తేదీ మధ్యాహ్నం 1గంట వరకు) ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 5.83 కోట్లు దాటింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడంలో ఏవైనా సమస్యలు ఉంటే ఒర్మ్@చ్ప్చ్.ఇంచొమెతక్ష్.గొవ్.ఇన్ను కాంటాక్టు చేయాలని ఐటీశాఖ ట్విటర్‌లో సూచించింది.

* జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ ఇపుడు జియో ఫైనాన్షియల్‌తో ఫండ్‌ పరిశ్రమలో ఇంకో సంచలనానికి తెర తీస్తున్నారా? దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో అనూహ్య మార్పులు రాబోతున్నాయా? ఇంత కాలం ఫండ్‌ నిర్వహణ ఛార్జీల పేరుతో మదుపర్లపై అధిక భారాన్ని మోపుతున్న విధానం ముగియనుందా? మ్యూచువల్‌ ఫండ్లలోకి అడుగుపెడుతున్న జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జీఎఫ్‌ఎస్‌ఎల్‌) సృష్టించనున్న విప్లవం ఎలా ఉండబోతోంది.. ఇపుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ జూన్‌ 30 నాటికి రూ.44.4 లక్షల కోట్లకు చేరుకుంది. మ్యూచువల్‌ ఫండ్లలో ఇప్పటికీ సంస్థలు, కార్పొరేట్‌ల పెట్టుబడులే ఎక్కువ. రిటైల్‌ మదుపర్ల వాటా 2 శాతంలోపే. దీన్ని మంచి అవకాశంగా మార్చుకోవాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

* ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో, బంగారం ఉంటే స్థైర్యంగా బతకొచ్చనేది దేశీయుల భావన. కొవిడ్‌ తీవ్రంగా ప్రబలినప్పుడు, జీవితమే నమ్మకం లేనిదిగా మారిన నేపథ్యంలో.. ఇతర పెట్టుబడి సాధనాల కంటే బంగారం కొని అట్టేపెట్టుకోవడమే శ్రేయస్కరమన్న భావన ప్రజల్లో అధికమైంది. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచీ పసిడి కాపాడుతుందనే విశ్వాసమూ ఇందుకు కారణమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌ (ఐఐఎంఏ) అధ్యయనంలో తేలింది. అందువల్లే ఇతర ప్రాంతాలతో పోలిస్తే, కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పుత్తడి కొనుగోళ్లు అధికంగా సాగినట్లు నిర్థారించింది. ‘కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఇంటి మదుపులో పసిడి వాటా’ నివేదికను ఐఐఎంఏ విడుదల చేసింది. ప్రతి 1000 మందికి 19 కొవిడ్‌ కేసులున్న ప్రాంతాలను మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. దేశంలోని 23 రాష్ట్రాల్లోని 160 జిల్లాల్లో నివసిస్తున్న 40,427 కుటుంబాల వారి నుంచి వివరాలు సేకరించి, ఈ సర్వే నివేదికను రూపొందించారు.

* వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లితో పాటు ఇతర గ్రామాల్లోని పరిస్థితిని పరిశీలించారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెన, రహదారులను పరిశీలించి.. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందాలు రేపట్నుంచి వరద నష్టం వివరాలు సేకరిస్తాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలన్న కిషన్‌ రెడ్డి.. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులను వాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని.. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తుందని చెప్పారు.