Health

పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల్లో పెరుగుతున్న క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు

పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల్లో పెరుగుతున్న క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు

భారతీయ పురుషుల్లో క్యాన్సర్‌ మరణాలు ఏటా 0.19 శాతం చొప్పున తగ్గుతుంటే, మహిళల్లో 0.25 శాతం చొప్పున అధికమవుతున్నాయని కొచ్చిలోని అమృత ఆస్పత్రి వైద్యుల అధ్యయనం తేల్చింది. 2000-2019 మధ్యకాలంలో భారత్‌లో క్యాన్సర్‌ మరణాలపై జరిపిన అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్‌ క్యాథరీన్‌ సౌవాజే కూడా భాగస్వాములయ్యారు. 2000-2019 మధ్య కాలంలో భారత్‌లో 23 రకాల క్యాన్సర్ల వల్ల 1.28 కోట్ల పైచిలుకు భారతీయులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా హృద్రోగం తరవాత ఎక్కువ మందిని బలిగొంటున్నది క్యాన్సర్‌ వ్యాధే. ఒక్క 2020లోనే ప్రపంచంలో క్యాన్సర్‌ మరణాలు 99 లక్షలుగా నమోదయ్యాయి. ప్రపంచ క్యాన్సర్‌ మరణాలలో 9 శాతం భారత్‌లోనే సంభవిస్తున్నాయి. 2000-2019 మధ్య కాలంలో భారత్‌లో స్త్రీపురుషులిద్దరిలో ఎక్కువ మరణాలు క్లోమగ్రంథి క్యాన్సర్‌ వల్ల సంభవించాయి. ఇదే కాలంలో ఉదరం, అన్నవాహిక, లుకేమియా, మెలనోమా క్యాన్సర్‌ మరణాలు తగ్గాయి. పిత్తాశయ, థైరాయిడ్‌ క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువ మరణాలకు దారితీస్తున్నాయి. క్లోమ గ్రంధి క్యాన్సర్‌ మరణాలూ స్త్రీలలో ఎక్కువే. ఈ తరహా క్యాన్సర్‌ మరణాలు స్త్రీపురుషులిద్దరిలో పెరుగుతున్నాయి. క్యాన్సర్‌ లక్షణాలను ముందే గుర్తించి చికిత్స చేయడానికి తగు వసతులను భారత్‌లో విస్తరించాలనీ, క్యాన్సర్‌ చికిత్సకు నిపుణులు, సహాయక సిబ్బందిని పెద్ద సంఖ్యలో తయారు చేసుకోవాలని పరిశోధకులు సిఫార్సు చేశారు.