ఇస్రో చేపట్టిన PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో.. శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు. ఒకే నెలలో ఇస్రో రెండు ప్రయోగాలను (చంద్రయాన్3, PSLV C-56) విజయవంతం చేసింది.ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ & టెక్నాలజీ ఏజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్‌గా PSLV C-56 తీసుకెళ్లింది. 5 డిగ్రీల వంపులో, 535 కిలోమీటర్ల ఎత్తులో.. నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. అయితే.. మొత్తం బరువు 228.64 టన్నులు కాగా, 7 ఉపగ్రహాల బరువు 442 కిలోలు. అధునాతన సాంకేతికతతో తయారు చేసిన DS-SAR ఉపగ్రహం.. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో కవరేజీని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ DS-SARతో పాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను ఇస్రో రోదసిలోకి పంపింది.
PSLV C-55 మాదిరిగానే PSLV C-56ని మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో ఇస్రో కాన్ఫిగర్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా.. సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. గగన్ యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. సూర్యుడుపై పరిశోధనలకు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించనున్నారు.