DailyDose

కేసీఆర్ సేవాదళం పేరిట ప్రజలకు టోకరా-TNI నేరవార్తలు

కేసీఆర్ సేవాదళం పేరిట ప్రజలకు టోకరా-TNI నేరవార్తలు

* నల్లగొండ జిల్లాలో జరిగిన ఏటీఏం చోరీ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ప్రజా అవసరాల కోసం ఎస్బిఐ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ లో రెండు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేశారు. అయితే, దొంగలు ఈ ఏటీఎంపై కన్నేశారు. ఇంకేముంది ప్రణాళిక రచించి అమాంతం దోచేశారు. వ్యాన్ లో వచ్చిన ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించారు. తమ దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు దొంగలు ఏటీఎంలోకి రాగానే సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంను కట్ చేసి డబ్బులు చోరీ చేశారు.

* కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ధర్మారంకు చెందిన రమేష్ చారి హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠాను ఏర్పాటు చేసి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. అధికార పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం వాటిని అమాయకులైన వారికి చూపెట్టి మోసం చేయడంలో దిట్ట. ఏకంగా సీఎం కేసీఆర్ పేరును వాడుతూ, కేసీఆర్ సేవాదళం అనే సంస్థ ఏర్పాటు చేసి కర్త, క్రియ నేను అంటూ ప్రగల్బాలు చెబుతూ, పరిచయస్తులను తన ముగ్గులోకి దింపడం ఇతని నైజం. ఇతగాడి సూటు, బూటు, కల్పిత మాటలు చూసి కొందరు అమాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి లక్షలు ఇవ్వగా, వారందరికీ కుచ్చుటోపీ అసహించుకునెలా తన మాటల గారడీతో ఇదిగో ప్రభుత్వ ఉద్యోగం అంటూ… చెబుతూ… నమ్మబలికేవాడు. ఇది బయట పడిన కొన్ని రోజులకు ఆన్లైన్ లో వస్తువులు తక్కువ రేటు అని పెట్టి ఆశపడి కొనుక్కునే వారి దగ్గరికి కొందరికి పంపించి నమ్మిస్తాడు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో అర్దర్లు రాగానే జెండా ఎత్తేయడం, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ మోసగానికి వెన్నెతో పెట్టిన విద్య.

* బాపట్లజిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ఈనెల 26వ తేది అదృశ్యమైన న్యాయవాది విఠల్‌బాబు మృతదేహం లభ్యమైంది. సుబాబుల్ తోటలో విఠల్‌బాబును చంపి పూడ్చిపెట్టారు ప్రత్యర్ధులు.. భూవివాదం కేసులో రాజీ చేసుకుందామని పిలిపించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.

* కేరళలో సినీఫక్కీలో ఓ భారీ దారి దోపిడీ జరిగింది. జాతీయ రహదారిపై ట్రక్కుతో ఓ కారును అడ్డుకుని, అందులోని ప్రయాణికులపై దాడి చేసి, రూ.4.5 కోట్లతో పరారైందో ముఠా. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ఓ కారులో బెంగళూరు నుంచి కేరళలోని మలప్పురం బయల్దేరారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 3 గంటల సమయంలో పుథుసేరి సమీపానికి చేరుకున్నారు. అంతలోనే కొంతమంది దుండగులు ప్లాన్‌ ప్రకారం ఓ భారీ ట్రక్కు సాయంతో వారి కారును అడ్డుకున్నారు. మరికొందరు వేరే కార్లలో అక్కడికి చేరుకున్నారు. మలప్పురం వెళ్తోన్న కారులోని ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి, నగదు దోచుకున్నారు. అనంతరం వారినీ తమ కార్లలో ఎక్కించుకుని.. త్రిసూర్‌ సమీపంలో వదిలేశారు. దీంతో బాధితులు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. 15 మందివరకు సభ్యులు గల ముఠా తమపై దాడి చేసిందని, తమ వద్ద ఉన్న దాదాపు రూ.4.5 కోట్లను దోచుకుందని వాపోయారు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ₹81.6లక్షల విలువైన 1.32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతడిపై కస్టమ్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.