Politics

వరంగల్ పర్యటనలో కిషన్ రెడ్డికి ఊహించని షాక్

వరంగల్ పర్యటనలో కిషన్ రెడ్డికి ఊహించని షాక్

వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. తోటి బీజేపీ ఎంపీ సోయం బాపురావు లంబాడీలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొందరు లంబాడ సంఘాల నేతలు, ప్రజాప్రతినిదులు.. కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. సోయం బాపురావుపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, గిరిజన సంఘాల నాయకులు కిషన్ రెడ్డికి ఓ వినతి పత్రం అందజేశారు.కిషన్ రెడ్డి ఆదివారం వరంగల్ పర్యటనలో ఉన్నారు. వరద ముంపు బాధితులను పరామర్శించడానికి ఆయన వెళ్లారు. కానీ, అక్కడ ఆయనకు లంబాడ సంఘాల నేతల నుంచి నిరసన సెగ ఎదురైంది. వెంటనే బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, పార్టీకి ఆయన చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి జనగామలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ప్రజల జనజీవనం స్తంభించిందని ఆయన అన్నారు. అనేక జిల్లాల ప్రజలు నష్టపోయారని వివరించారు. పంటలు, జంతుజాలం దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మౌలిక వసతులూ నష్టపోయాయని తెలిపారు.మూడు రోజుల పాటు బీజేపీ బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుందని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో వరదల గురించి కేంద్ర హోం మంత్రి అమిత షాను కలిసి శనివారం వివరించామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణకు కేంద్ర బృందం పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. సోమవారం ఈ బృందం తెలంగాణకు వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ రిపోర్టును తీసుకుంటుందని వివరించారు.