తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మహిళల కోసం ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. జూలై 31 నుంచి ఐటీ కారిడార్ కోసం ప్రత్యేక “మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్” బస్సు సర్వీసును నడపాలని నిర్ణయం తీసుకుంది. స్పెషల్ లేడీస్ బస్సు సర్వీస్.. జేఎన్‌టీయూ నుంచి వేవ్ రాక్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చారు. ఇది ఆఫీసు వేళల్లో ఎటువంటి ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించనుంది. హైదరాబాద్ నగరంలోని ఐటీ కంపెనీల్లో ఐదు లక్షల మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని అంచనా.
జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుండి బయలుదేరే బస్సు ఫోరం/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గ్, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా ప్రయాణించనుంది. ఇక, సాయంత్రం 5.50 గంటలకు వేవ్ రాక్ నుంచి బయలుదేరి.. అదే మార్గంలో జేఎన్‌టీయూ చేరుకోనుంది. ఈ బస్సు సర్వీసుకు వచ్చే స్పందనను బట్టి మరిన్ని రూట్లలో కూడా ఇలాంటి సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు.‘‘హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు జేఎన్టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ప్రత్యేక బస్సును.. మహిళా ప్రయాణికులు వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది’’ అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.