Politics

‘మన్ కీ బాత్’ని రాజకీయాలకు లింక్ చేయవద్దని పురందేశ్వరి విజ్ఞప్తి

‘మన్ కీ బాత్’ని రాజకీయాలకు లింక్ చేయవద్దని పురందేశ్వరి విజ్ఞప్తి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్‌లో సామాజిక అంశాలు, మంచి పనులు ఉంటాయని తెలిపారు. ఏపీ బీజేపీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేదే ఈ మన్ కీ బాత్ అని అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 30 కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని మోడీ చెప్పారన్నారు. 2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచి తిరిగి తెస్తున్నామని మోడీ తెలిపారన్నారు. మధ్యప్రదేశ్‌లోని విచార్‌పూర్ అనే గ్రామాన్ని మినీ బ్రెజిల్‌గా పేర్కొంటారని, అక్కడి పిల్లల్లో ఫుట్‌బాల్ క్రీడకి కావాల్సిన నైపుణ్యం వారి జీన్స్‌లోనే ఉందని కొనియాడారు. విచార్‌పూర్ ఒక చిన్న ఆదివాసీ గ్రామమని చెప్పారు. మన్ కీ బాత్ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని చెప్పుకొచ్చారు.కాగా.. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోడీ మొదట హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం 11:30 నుంచి తెలుగులో మాట్లాడారు. దేశంలో డ్రగ్స్, మత్తు పదార్ధాలు లేకుండా చేయడం.. యువతను వాటి నుంచి దూరం చేయడంపై ప్రధాని ప్రసంగించారు. 75 సంవత్సరాల స్వతంత్రం వేడుకల సమయంలో యువత ప్రాధాన్యత గురించి మోడీ చెప్పారు. పలు దేశాల్లో ఉండిపోయిన భారత కళాకృతులను వెనక్కు తీసుకొచ్చామన్నారు. అలాగే.. తిరుపతిలో భక్తులు, యాత్రికుల కోసం ప్రసాద్ స్కీంను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.