కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్.. మేడ్-ఇన్-ఇండియా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోన్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఈ ప్రాజెక్ట్ ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కృషి చేస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు వేరియంట్‌లను త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇవి మూడు రంగులలో ( తెలుపు – నీలం, కాషాయం రంగు – బూడిద రంగు, బూడిద రంగు – కాషాయం రంగు ) ఉండనున్నాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుత వెర్షన్ 150-600 కి.మీ దూరంలో ఉన్న నగరాల మధ్య ప్రయాణానికి చైర్ కార్ వేరియంట్‌గా ఉంటుంది. వందే భారత్ మెట్రో 100-150 కి.మీ పరిధిలోని నగరాల కోసం అర్బన్ రైలు కనెక్టివిటీ నెట్‌వర్క్‌గా పనిచేయనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ 600 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేయనుంది. ఇది దీర్ఘకాలంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ మాదిరిగా సేవలు అందించనుంది.వీటిలో, వందే భారత్ స్లీపర్ వెర్షన్ వేగాన్ని పెంచడానికి భారతీయ రైల్వే కృషి చేస్తోంది. ఇది 220 kmph వేగంతో పరుగుతు తీయనుంది. ప్రస్తుత తరం వందే భారత్ రైళ్ల చైర్ కార్ వెర్షన్ కంటే 40 kmph ఎక్కువ. సెమీ-హై స్పీడ్ రైళ్లు స్టీల్‌కు బదులుగా అల్యూమినియంతో తయారు చేయనున్నారు.. ఇది రైలు బరువును తగ్గిస్తుంది, అందువల్ల వేగం పెరుగుతుంది. ఇది అందుబాటులోకి వస్తే.. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లుగా మారనుంది.
ప్రస్తుత జనరేషన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 180 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 160 kmph (కొన్ని విభాగాలలో) మాత్రమే ప్రయాణిస్తుంది. కొన్ని చోట్ల అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే శాఖ మొత్తం 400 వందేభారత్ రైళ్లకు టెండర్లు జారీ చేసింది. ఇవి క్రమంగా పట్టాలెక్కనున్నాయి.ఈ ఏడాది చివరి నాటికి కొన్ని రైళ్లను ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎలక్షన్ల నాటికి చాలా రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలను రచిస్తోంది.