* తెలంగాణ వరద బాధితులకు టీడీపీ సాయం
తెలంగాణ వరద బాధితులకు టీడీపీ సాయం చేయనుందని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందని.. వరంగల్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని వెల్లడించారు. భారీ వర్షాలకు ఆపర పంట నష్టం జరిగిందని.. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భారీ నష్టం అన్నారు.చనిపోయిన కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం, ఎకరానికి 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ తరపున వరద ప్రాంతాల్లో దుప్పట్లు.. నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. GHMC పరిధిలో వరద భాదితులకు 10వేల హామీ ఏమైంది ? అని నిలదీశారు. సకాలంలో వరద ప్రాంతాల్లో హెలి కాప్టర్ పంపలేదు. అందుకే ప్రాణ నష్టం జరిగిందని ఫైర్ అయ్యారు కాసాని జ్ఞానేశ్వర్.
* రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ
రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి.పార్లమెంటులో మణిపూర్ మంటలు ఆరడం లేదు. గత పదిరోజులుగా ఉభయ సభల్ని మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మధ్యాతర్వాత రాజ్యసభలో మణిపూర్‌పై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం తెలిపింది. అయితే అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్ ఘటనపై విపక్ష ఎంపీలో నినాదాలతో హోరెత్తించడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
* కలవరం రేపుతోన్న కండ్లకలక
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే, వర్షాలు తర్వాత కండ్లకలక బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కండ్లకలక కలవరం రేపుతోంది.ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో కండ్లకలక కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు చేతుల పరిశుభ్రత పాటించాలనీ, కంటి ఇన్ఫెక్షన్ నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కండ్లకలక గురించి వైద్యులు హెచ్చరిస్తూ.. ప్రజలు తమ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు చేతుల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. తరచూ కండ్లను తాకకుండా ఉండాలని పేర్కొంటున్నాయి. కండ్లకలక వ్యాప్తిని నివారించడానికి, ప్రభావిత వ్యక్తులు ఉపయోగించే టవల్స్, ఇతర వ్యక్తిగత వస్తువులను ప్రజలు తాకకుండా ఉండాలన్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలనీ, ఇది సోకిన వారు బయటకు వెళ్లకుండా ఉండటంతో వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమణ వ్యాప్తిని తగ్గించడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
* గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: జగన్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు.చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
* రాయలసీమలో రాజుకుంటున్న రాజకీయం
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ, ఏపీలో మాత్రం ప్రధాన పార్టీలన్నీ తగ్గేదేలే అంటూ పొలిటికల్ స్పీడును పెంచాయి.. అధికార పార్టీ వైసీపీ సహా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటినుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపటినుంచి (ఆగస్టు 1) చంద్రబాబు రాయలసీమలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనతోపాటు టీడీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ విస్తరణ, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, పలు వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు పర్యటించనున్నట్లు సమాచారం. అయితే, చంద్రబాబు పర్యటన ప్రారంభం కాకముందే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టుల పరిశీలన ఎలా చేస్తారంటే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.అసలు రాయలసీమకు ద్రోహం చేసిందే చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. క్షేమంగా ఉన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు అడుగుపెడితే క్షామం వస్తుందంటూ ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాయలసీమలోని ప్రాజెక్టుల పరిశీలనకు రానున్న చంద్రబాబు.. మూడో తారీఖు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బైరవానితిప్పే, హంద్రీనీవా కాలువ, పేరూరు డ్యామ్, కియా పరిశ్రమలను సందర్శించనున్నారు. కాస్తో.. కూస్తో వర్షాలు పడుతున్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే వర్షం కూడా వెనక్కి పోతుందన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు అనంతపురం జిల్లాకు రావద్దంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
* అంబటి రాయుడికి అమరావతి సెగ
మాజీ ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్యన ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి చురుకుగా మాట్లాడుతూ ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు ఉన్నాయి. రాయుడు పొలిటికల్ ఎంట్రీ కంఫర్మ్ అయితే మాత్రమే అది ఖచ్చితంగా వైసీపీకి అన్నది తెలిసిపోయింది. కాగా తాజాగా అంబటి రాయుడు అమరావతి ప్రాంతం వెలగపూడిలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ అమరావతి రైతులు రాయుడిని కలిసి కొంచెం సేపు మాట్లాడారు, ఈసందర్భంగా వారి సమస్యలను వివరించే ప్రయత్నం చేయగా అంబటి రాయుడు నాకు సమయం లేదని మరోసారి వస్తానని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రైతులు మా సమస్యలకు మీరు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కనీసం మా బాధలు వినండి అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం బాధాకరం.ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది… ప్రజల సమస్యలు వినకుండా వెళ్ళిపోతే రేపు రాజకీయంగా ఎవరు నీకు మద్దతుగా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
* ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?
ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్‌ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు అంబాటులో ఉంది. అయితే ఈ స్పీడ్‌ను ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌కు అధికారులు జారీ చేశారు. ఇటీవల ఓఆర్ఆర్ అధికారులు, పోలీసులతో మంత్రి కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత సోమవారం ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.ఓవైపు చూసుకుంటే ఓఆర్ఆర్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు గతంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓర్ఆర్ఆర్పై వేగ పరిమితిని 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ఆర్ ప్రయాణికులు భద్రతపై చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పీడ్ లిమిట్‌ను పెంచాలని భావించారు. ప్రస్తుతం దాదాపు 154 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ఆర్పై లైటింగ్ సిస్టంతో పాటు రోడ్ సేఫ్టీ మేజర్స్ పాటిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు.దీంతో స్పీడ్ లిమిట్‌ను తిరిగి 120 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
* పెద్దాపురంలో పొలిటికల్ హీట్
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి కొనసాగుతుంది. ఇరువర్గాలు లై డిటెక్టర్ టెస్టుకు సై అంటే సై అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దొరబాబుల మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడంతో పాటు.. పలు ఆరోపణలు సంధించుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ది జరిగిందంటే.. కాదు తమ ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగిందంటూ బహిరంగ సవాళ్లకు దిగారు. దొరబాబుకు అభివృద్ది చేయాలనే ఆలోచన లేదని.. అభివద్ది పనులకు అడ్డుపడుతున్నారని నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అక్రమ మైనింగ్, మట్టి మాఫియాకు, గ్రావెల్ తవ్వకాలకు దొరబాబు అండగా ఉంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే దొరబాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎవరి ప్రభుత్వంలో అవినీతి జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమని దొరబాబు ప్రకటించారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఇద్దరం లై డిటెక్టర్ టెస్టు చేయించుకుంటే.. ఎవరూ చెబుతుంది వాస్తవమనేది ప్రజలు తెలుస్తుందని చినరాజప్పకు సవాలు విసిరారు. తన నిజాయితీ రుజువు కాకపోతే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. మరోవైపు లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దమని చినరాజప్ప ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పెద్దాపురంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇరువురు నేతలు కూడా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో లై డిటెక్టర్ టెస్టులకు సిద్దమయ్యారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను కూడా మోహరించారు. అధికార, విపక్ష పార్టీలు పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ స్థానికంగా నెలకొంది.
* ఎయిర్ పోర్టులో 47 కొండచిలువలు పట్టివేత
సాధారణంగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం, డ్రగ్స్, కరెన్సీ తరలించడం చూస్తుంటాం. కానీ ఓ ప్రయాణికుడు ఏకంగా కొండిలువలు తీసుకువచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలేషియా లోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు, రెండు బల్లులను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడి బ్యాగ్‌లో ఏదో ఉన్నట్లు అనుమానించి తనిఖీ చేశామని.. అందులో పలు జాతులకు చెందిన కొండచిలువలను గుర్తించామని చెప్పారు. రంధ్రాలున్న పెట్టెల్లో వాటిని తీసుకువచ్చాడని.. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
* మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతోన్న హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవద్దని మంత్రికి సూచించింది. అదే సమయంలో పిటిషన్ వేసిన రాఘవేందర్ రాజును ఆయన వద్ద ఉన్న అఫిడవిట్లు, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 2018లో ఎన్నికలు జరిగినపుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు వివరాలతో ఎలక్షన్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పిచారని పేర్కొంటూ మహబూబ్ నగర్ నివాసి రాఘవేందర్ రాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించాలని రాఘవేందర్ రాజు తన పిటిషన్లో పేర్కొన్నారు.దీనిపై ప్రస్తుతం హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ క్రమంలో గతవారం హైకోర్టుకు వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వెయ్యాలని అభ్యర్తిస్తూ పిటిషన్ వేశారు. కాగా, ఈ పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంటూ హైకోర్టు దానిని కొట్టి వేసింది. తాజాగా సోమవారం రాఘవేందర్ రాజు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కేసుకు సంబంధించిన ఎలాంటి వివరాలను మీడియాతో షేర్ చెయ్యవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోపాటు రాఘవేందర్ రాజుకు ఆదేశాలు ఇచ్చింది. తన వద్ద ఉన్న అఫిడవిట్ కాపీతోపాటు ఆధారాలను కోర్టుకు ఇవ్వాలని రాఘవేందర్ రాజు కు సూచిస్తూ తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.